Thursday, 1 December 2011

అందరూ దొంగలే ! : ఆంధ్రా ‘అన్నా’కు ‘తీర్పు’ భీతి! : Chandra Babu - Chanakya of Corruption

Chandra Babu  -  Chanakya of Corruption  :  ఆంధ్రా ‘అన్నా’కు ‘తీర్పు’ భీతి!
‘ఆంధ్రా అన్నా హజారే’పై అవినీతి కేసా?! అంటూ ‘తెలుగు తమ్ముళు’్ల ఆగ్రహించినంత మాత్రాన, అది ధర్మాగ్రహం అనిపించుకోదు. ‘ఎవరు తీసిన గోతిలో వారే పడతారు’ అన్న సామెతను బహుశా వారు మరచినట్టున్నారు. ‘తాము చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు’ అన్నది కాలం చెల్లిన భూస్వామ్య నీతి అనిపించుకుంటుందే కాని, ప్రజాస్వామ్య రాజకీయ స్ఫూర్తి కానేరదు. అలాంటి వాదనలను ప్రజలు కూడా మెచ్చరు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలతో దాఖలైన ‘ప్రజాప్రయోజనాల వ్యాజ్యం’లో హైకోర్టు ధర్మాసనం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పుడు, జగన్ అవినీతిపరుడా? కాదా? అన్న ప్రశ్న తేలకముందే చంద్రబాబుతో సహా తెలుగు తమ్ముళ్లు వ్యవహరించిన తీరును ప్రజలింకా మరచిపోలేదన్నది గుర్తించాలి. దొడ్డి దారిన అధికార పగ్గాలు చేపట్టిన అమాత్యులతో, ప్రధాన ప్రతిపక్షంలోని సభ్యులు కొందరు కలిసో కలవకో, యాదృచ్ఛికంగానే అయినా జగన్ అక్రమ ఆస్తులు కూడగట్టారని హైకోర్టుకు లేఖ రాసి సీబీఐని రంగంలోకి దింపడానికి చేసిన ప్రయత్నం అక్రమం అనిపించకపోవడం విడ్డూరమే. ‘జగన్ అక్రమాలపై అనేకసార్లు సీబీఐ విచారణకు ప్రభుత్వాన్ని కోరినా, ప్రభుత్వం సిద్ధపడకపోవడంతో కోర్టునాశ్రయించక తప్పలేదు’ అన్న తమ్ముళ్ల వాదన పస లేనిది. ఒకవేళ అదే నిజమనుకుంటే, చంద్రబాబు అవినీతిపై వైఎస్ విజయమ్మ హైకోర్టుకు లేఖ రాయడాన్ని రాజకీయ కుట్రగా వర్ణించడం ఎలా సాధ్యం? ఇదెక్కడి పద్ధతి! బాబు రాజకీయ మిత్రులు, సీపీఐ నేత నారాయణ కూడా రాజకీయ దురుద్దేశంతోనే విజయమ్మ కోర్టుకు లేఖ రాశారని అంటున్నారు. జగన్‌పై రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్, తెలుగుదేశం కూడబలుక్కుని కోర్టుకెక్కాయని నారాయణ అనలేకపోయారు ఎందుకనో!

‘తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పాలన్నారు’ పెద్దలు. బాబుగారి తెలుగుదేశంతో సీపీఐకి ఎన్నో రాజకీయ అవసరాలు ఉండి ఉండవచ్చు. శాసనసభలో కేవలం నాలుగు స్థానాలున్న వారికి, రాష్ట్ర శాసన మండలిలో స్థానం దక్కించడంలో చంద్రబాబు సహకారం అపూర్వం! అన్న కృతజ్ఞత వారికి ఉండటంలో ఆశ్చర్యం లేదు. అయినా, ఏమాట కామాటే చెప్పుకోవాలి. కొందరు కాంగ్రెస్ నేతలకన్నా నారాయణే నయం. వైఎస్ సహకారం లేకుండా శాసనసభలో అడుగుపెట్టలేని వారు, ఆయన దయాదాక్షిణ్యాలతో శాసనసభ్యులై, అమాత్యులుగా అందలమెక్కిన సంగతి తెలిసిందే! ‘అన్నం పెట్టిన చేతినే కరచినట్టు’ వైఎస్ మరణానంతరం అలాంటి వారంతా కనీస కృతజ్ఞతాభావం లేకుండా, నేడు అదే అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించడం రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వారితో పోలిస్తే నారాయణ వెయ్యి రెట్లు నయం కదా!

అదలా ఉంచితే, ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని కోర్టులతో భర్తీ చేయగలరా? ‘మార్క్సిస్టులు’ అని చెప్పుకునే వారిని ప్రశ్నిస్తే, జగన్ వంటి ‘అవినీతి సామ్రాట్టు’ను బలపరచడమా అని వక్రీకరిస్తూ, ఎదురు ప్రశ్నించడం సమాధానం కాదు. సీబీఐ విచారణ ప్రాథమిక దశలో ఉండగానే, కోర్టు తీర్పు వెలువడక ముందే జగన్‌పై రాజకీయనేతలే తీర్పులు వెలువరించడం ఆక్షేపణీయం కాదా? అని ప్రశ్నించడం నేరం కాదు.

ఆ ప్రశ్నకూ జగన్‌కూ సంబంధం లేదు. అదొక సమకాలీన రాజకీయ సిద్ధాంతానికీ, రాజ్యాంగ స్ఫూర్తికీ చెందిన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం దాటవేయడం రాజకీయ ‘విజ్ఞత’ అనిపించుకోదు. వారు పూజించే రాజ్యాంగం సూత్రాలను గౌరవించాలని గుర్తు చేస్తే, అది జగన్‌తో కుమ్మక్కయినట్లా! అలాంటప్పుడు, ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీతో సైతం కలిసి పోరాడతామని సీపీఎం నేత రాఘవులు ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ప్రజా సమస్యలపై ఎవరితోనైనా కలిసి పోరాడటానికి అభ్యంతరకరం ఉండకూడదు. వీలైనంత ఎక్కువ మంది ప్రజానీకాన్ని కదిలించేందుకు అదొక మార్గం. సీపీఐ, సీపీఎంలు గతంలో అనేక పర్యాయాలు చంద్రబాబుతో కలిసి పోరాడాయి కూడా. కానీ, ఆ కలిసి పోరాడటాన్ని ‘రాజకీయ ఐక్యత’ వరకూ లాగి, చివరకు 2009 శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగానూ సమర్థించలే ని చంద్రబాబు ‘మహాకూటమి’లో భాగస్వామిగా మారడం తీవ్ర విమర్శకు గురైంది. కేవలం రాజశేఖరరెడ్డిని అధికారం నుంచి దించాలన్న ‘ఏకవాక్య ఎజెండా’తో ఏర్పడిన ఆ మహాకూటమి పచ్చి అవకాశవాదంతో కూడిన పదవీ వ్యామోహ ధోరణి తప్ప రాజకీయపరమైనది కానేకాదు. కాంగ్రెస్ పార్టీ లేదా టీడీపీ ఎన్ని చీలికలు పేలికలైనా కమ్యూనిస్టులు బాధపడవలసిందేమీ లేదు. అలాంటి చీలికలు పేలికల ఆసరాగా ఏర్పడే అవకాశవాద రాజకీయ పొత్తులు మాత్రం సమ్మతం కాదు.

‘అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు’ అన్న సామెతలా తయారైంది నేడు చంద్రబాబు పరిస్థితి! చూపుడువేలు అందరికీ ఉన్నప్పటికీ, దాంతో రాజకీయం నెరపడం తనకొక్కడికే సాధ్యమని మురిసిపోతుంటాడు బాబు. కాంగ్రెస్, అంతకు మించి జగన్‌వైపు వేలెత్తి చూపే చంద్రబాబుకు ఇప్పుడు ఈ సామెత గతే పట్టింది! తెలుగు తమ్ముళ్లయితే బరితెగించి మరీ జగన్‌కు తీహార్ జైలు తప్పదని జోస్యం చెప్పారు. మరి ఇప్పుడు తమ అధినాయకునికి ఏ జైలు గది రిజర్వు చేస్తారో! ‘గాజు మేడల్లో కూర్చున్న వారు, ఇతరులపై రాళ్లు రువ్వడం మంచిది కాదని, ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది.

ఇంతకీ, విజయమ్మ పిటిషన్‌పై బాబు ఏ కోర్టుకు వెళతారో తేల్చి చెప్పలేదు. ‘గజం మిథ్య పలాయనం మిథ్య’ అన్నట్టు, చంద్రబాబు అవినీతి మిథ్య, విజయమ్మ లేఖలో అంశాలు మిథ్య అయినప్పుడు విచారణకు వెరవడం దేనికి? ఎదుటి వారు అవినీతిపరులని యాగీ చేసేముందు, తన విశ్వసనీయతనూ రుజువు చేసుకోవాలి. చంద్రబాబు పదవీ వ్యామోహం, అవకాశవాద రాజకీయాలు తెలుగు ప్రజలకు తెలియనివేమీ కావు. అందుకే, జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రకు ఎక్కడ చూసినా ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే తెలివి తమ సొత్తే అనుకుంటే పొరపాటే. తెలంగాణ సమస్యను అదే పనిగా నానుస్తూ పోతే, క్రమేపీ తెలంగాణ ప్రజల్లో ఆ ఆకాంక్ష నీరుగారిపోతుందని అడ్డమైన ఎత్తులూ వేస్తున్నది. వారి కలలు కల్లలు కాక తప్పదని తెలంగాణ సకల జనుల సమ్మె నిర్ద్వంద్వంగా నిరూపించింది. ఎన్ని కుట్రలూ కుతంత్రాలూ పన్నినా, ప్రత్యేక తెలంగాణపై ప్రజల ఆకాంక్ష చల్లారదన్నది పార్లమెంటు శీతాకాల సమావేశాలు మరోసారి రుజువుచేస్తున్నాయి.

అయినా, 2014 వరకు ఏదో ఒక రీతిలో కాలయాపన చేద్దామన్న కుయత్నాలకు కాంగ్రెస్ ఒడిగడుతోంది. ‘తాటినెక్కే వాడొకడైతే, వాడి తలదన్నే వాడొకడన్నట్లు’ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి యూపీ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చెయ్యాలన్న ప్రతిపాదనతో రంగం మీదకు రావడమే కాక, ఆ మేరకు అసెంబ్లీలో ఏకంగా తీర్మానమే చేయించింది. దానితో కాంగ్రెస్ కుదేలయింది. మాయావతి ఎత్తుగడతో రానున్న ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో ఆధిపత్యం సంగతి సరేసరి, కాంగ్రెస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. దానిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ కూడా రాష్ట్ర విభజనకు తామూ సిద్ధమేనని ప్రకటించాలి! లేకుంటే అసలే జనాకర్షణలేక కుంటుతున్న రాహుల్ గాంధీ పరిస్థితి, అక్కడ మరింత దెబ్బతింటుంది. అలా కాదని అంగీకరిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందుకు వెనకాడాలి? అన్న ప్రశ్న వస్తుంది. ‘ముందు గొయ్యి వెనుక నుయ్యి’. ఇదీ కాంగ్రెస్ పరిస్థితి. రెండో ఎస్సార్సీ అంటే అది కాలయాపన తప్ప మరొకటి కాదని ప్రజలు భావిస్తారు. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్నట్లు ఉత్తరప్రదేశ్‌లో బుందేల్ ఖండ్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలన్నది కాంగ్రెస్ డిమాండే! ఇప్పుడు మాయావతి ఏకంగా ఒక్కటేమిటి నాలుగు భాగాలుగా ఉత్తరప్రదేశ్‌ను విభజించాలంటూ ముందుకొచ్చారు!

ఇక అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయి విజయమ్మ చేత బాబుపై హైకోర్టులో పిటిషన్ వేయించారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. కాని వాస్తవం మరోలా ఉంది. గుంటూరులో అప్రతిహతంగా కొనసాగుతున్న ఓదార్పు యాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు సీబీఐ అంటే ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’గా కాంగ్రెస్ పార్టీ మార్చేస్తున్నదని కూడా ప్రసంగిస్తున్నారు. మరోవైపు, విజయమ్మ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ప్రజా కోర్టులో తేల్చుకుంటామని బాబు అంటున్నారు. ప్రజాకోర్టు అంటే మన రాష్ట్రంలో ‘మావోయిస్టుల కోర్టు’లనుకునే ప్రమాదం ఉంది. ప్రజాకోర్టు అంటే ప్రజలలోకి వెళ్లి తమ నేతపై కుట్రపూరితంగా విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పైన, అలాగే తమ నేత అన్నా హజారేకి ప్రతిరూపమని గతంలో నిరూపితమైన విషయాన్ని ప్రజలలో ప్రచారం చేస్తారట! ఈ విషయంలోనూ, జగన్ తరఫు నేతలు ప్రజాకోర్టు ఏమిటి, ప్రజాతీర్పుకే వెళ్దాం అంటూ తెలుగుదేశం పార్టీని రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టమని సవాలు చేస్తున్నారు. దాన్ని బలపరుస్తామని ఒకడుగు ముందుకేసి ప్రకటిస్తున్నారు! వాస్తవం ఏమిటంటే, 2014లో గానీ ఎన్నికలు రావని, అంతవరకూ ఈ ప్రభుత్వమే కొనసాగుతుందని ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు తెలుగు తమ్ముళ్లూ ప్రకటించడం. ఈ విషయంలో తెలుగుదేశం నేతల సవాళ్లు ‘మాటలు కోటలు దాటుతాయి. మనిషి గడపదాటడు’ అన్నట్లుంది. ఇదీ రాష్ట్రంలో నేటి రాజకీయ చిత్ర, విచిత్ర నాటకం.

ఏమైనా హైకోర్టును ఒక విషయంలో అభినందించక తప్పదు. నిష్పక్ష పాతంగా విచారణకు ఆదేశించింది. అదే విధంగా ఏ పక్షపాతమూ లేకుండా తీర్పును వెలువరిస్తుందని ఆశిద్దాం! అయినా చట్టం తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. దానిని చేసుకోనిస్తే! ఇంతకీ చెప్పొచ్చేదేమంటే చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరూ సీబీఐ ఎంక్వయిరీని ఎదుర్కొంటున్నారు! తీర్పు వెలువడవలసే ఉంది. మీడియా, రాజకీయ నేతలు సంయమనం పాటించి ముందస్తు తీర్పులు ఇవ్వకుండా ఉంటే అదే పదివేలు! 
 http://www.sakshi.com/Main/Weeklydetails.aspx?Newsid=31668&subcatid=18&categoryid=1

అందరూ దొంగలే ! : బాబు అవినీతి మూలాలపై సీబీ‘ఐ’ : Chandra Babu - Chanakya of Corruption

Chandra Babu  -  Chanakya of Corruption : బాబు అవినీతి మూలాలపై సీబీ‘ఐ’
విజయమ్మ పేర్కొన్న ఆధారాలపై లోతుగా అధ్యయనం
ఆదివారం కూడా విధులకు హాజరైన జేడీ, ఇతర అధికారులు
ప్రశ్నావళికి రూపకల్పన.. నేడు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, హెరిటేజ్‌లకు నోటీసులు!

హైదరాబాద్, న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాలు, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో... సీబీఐ అధికారులు ఆయన అవినీతి మూలాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఉన్న ఆస్తులు...తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో లెక్కకుమిక్కిలిగా పెరిగిన ఆస్తులపై దర్యాప్తు జరపాలని భావిస్తున్నారు. భూకేటాయింపులు, ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున లబ్ధిపొందారనే ఆరోపణల నేపథ్యంలో.. తొమ్మిదేళ్లలో చంద్రబాబు చేసిన కేటాయింపులు.. కూడబెట్టిన అక్రమ ఆస్తుల బండారాన్ని బట్టబయలు చేస్తూ వైఎస్ విజయమ్మ సమర్పించిన దాదాపు 2 వేల పైచిలుకు డాక్యుమెంట్ల రూపంలోని ఆధారాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. సీబీఐ జేడీ వి.వి.లక్ష్మీనారాయణతోపాటు ఇతర అధికారులు ఆదివారం కూడా విధులకు హాజరయ్యారు. చంద్రబాబుతోపాటు ప్రతివాదులుగా ఉన్న 12 మంది నుంచి ఏం సమాచారం కోరాలనే విషయంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ మేరకు ప్రశ్నావళిని సైతం రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమకు కావాల్సిన డాక్యుమెంట్లతో హాజరుకావాల్సిందిగా మొదటి దఫాగా బాబు, భువనేశ్వరి, లోకేష్, హెరిటేజ్‌లకు సోమవారం నోటీసులు జారీ చేయనున్నారు.

కుప్పలుతెప్పలుగా పెరిగిన ఆస్తులపై ఆరా!

1986లో తన కుటుంబం మొత్తానికి 70 ఎకరాల భూమి ఉండేదని, అప్పట్లో కుటుంబం విడిపోయాక తన వంతుగా వచ్చిన సొమ్ముతో నెల్లూరు జిల్లా బాలాయపల్లిలోని నిండాలిలో భూములు కొన్నట్లు.. 1988లో కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్లో చంద్రబాబు పేర్కొన్నారు. ఆ భూముల ద్వారా తనకు ఏడాదికి రూ.36,000 ఆదాయం వచ్చేదని, తాను స్వయంగా వ్యవసాయం చేస్తూ హైబ్రిడ్ వేరుశనగ పండించేవాడినని తెలిపారు. కానీ చంద్రబాబు 1978లో మంత్రి పదవి చేపట్టిన నాటినుంచే అక్రమ మార్గాల్లో ఆస్తిని పెంచుకుంటూ పోయారు.

సొంత తండ్రికే తన భూమిని తనఖా పెట్టడం, విక్రయించటం వంటి లావాదేవీలు నడిపారు. 1983లో టీడీపీలో చేరుతూనే తిరుపతిలో త్రీస్టార్ హోటల్ నిర్మించారు. తర్వాత దాన్ని టీడీపీకి చెందిన మరో నేతకు విక్రయించారు. కాగా నిండాలి, వాక్యం గ్రామాల్లో తన బంధువుల నుంచి అతితక్కువ రేటుకు అంటే ఎకరా రూ.1,000 చొప్పున 1985లో తొలుత 65 ఎకరాలు కొనుగోలు చేసిన చంద్రబాబు... ఆ తరవాత బినామీ పేర్లతో మరో 250 ఎకరాలు కొన్నారు. ఈ మొత్తం భూముల చుట్టూ 12 కిలోమీటర్ల మేర ప్రహరీ నిర్మించారు. అంతేకాదు.. ప్రభుత్వ భూముల్ని, నాలుగు పెద్ద చెరువుల్ని ఆక్రమించి మరీ తోట నిర్వహిస్తుండటాన్ని విజయమ్మ ఆధారాలతో సహా వివరించారు. అప్పట్లో తెహల్కా డాట్ కామ్ ఈ భూముల లోగుట్టును బయటపెట్టడంతో కారుచౌక ధరలకు తన బంధువులకు వీటిని విక్రయించినట్లుగా చూపించి... ఇప్పటికీ తన బినామీ తోటగా దాన్ని కొనసాగిస్తున్న వైనాన్నీ.. విజయమ్మ తెలిపారు. ఇలా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తులు పెరిగిన తీరుపై చంద్రబాబును వివరణ కోరాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. మరోపక్క ఈ కేసుపై దర్యాప్తు జరపాలని డీజీపీని సైతం కోర్టు ఆదేశించడంతో ఈమేరకు సీఐడీ కూడా కసరత్తు చేస్తోంది. సీబీఐ అధికారులతో కలిసి ప్రాథమిక విచారణ జరపాలని వారు నిర్ణయించినట్లు సమాచారం.

విశాఖ నుంచి ప్రత్యేక బృందం

బాబు అక్రమాస్తుల కేసు దర్యాప్తునకు విశాఖపట్నం నుంచి ఐదుగురు అధికారులతో కూడిన బృందం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో వీరు విధులు నిర్వర్తిస్తారు. విజయమ్మ సమర్పించిన ఆధారాల అధ్యయనం బాధ్యతను జేడీ వీరికి అప్పగించినట్లు తెలుస్తోంది. 
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=274949&Categoryid=1&subcatid=33

అందరూ దొంగలే ! : చంద్రబాబు అక్రమాస్తుల కేసు.. రెడ్డీస్ ల్యాబ్స్‌కు సీబీఐ నోటీసులు : Chandra Babu - Chanakya of Corruption

Chandra Babu  -  Chanakya of Corruption
బాబు హయాంలో రూ.25 కోట్ల పన్ను మినహాయింపులపై ఆరా
టీడీపీ అధినేత భారీ మొత్తంలో లబ్ధి పొందినట్లు ఆరోపణలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: మాజీ సీఎం చంద్రబాబు అక్రమాస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు ఊపందుకుంది. ఇందులో భాగంగా డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ లిమిటెడ్‌కు సీబీఐ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. బాబు హయాంలో భారీగా పన్ను మినహాయింపులకు సంబంధించి ఈ నోటీసులిచ్చారు. పన్ను మినహాయింపుల వివరాలను డాక్యుమెంట్లతో సహా అందించాలని పేర్కొన్నారు. సీబీఐ నోటీసులందాయని సంస్థ ప్రతినిధులు ధ్రువీకరించారు. వారు కోరిన పత్రాలలిస్తామని తెలిపారు. సీఎంగా చంద్రబాబు తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని 1998లో రెడ్డీస్ ల్యాబ్స్‌కు టాక్స్ డిఫర్‌మెంట్ వర్తింపజేయడం వల్ల సంస్థకు రూ.25 కోట్ల లబ్ధి చేకూరింది. ప్రతిగా వారి నుంచి ఆయన భారీగా లబ్ధి పొందారనే ఆరోపణలున్నాయి. బాబు కుటుంబీకుల భూములను మార్కెట్ విలువ కన్నా ఎక్కువకు రెడ్డీస్ అధిపతి అంజిరెడ్డి కుమారుడు సతీష్‌రెడ్డి, ఆయన భార్య దీప్తీరెడ్డి కొనుగోలు చేశారు. అదంతా బోగసని భూముల కొనుగోలు లావాదేవీలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. బాబు కుటుంబం ఆ భూములను ఎంతకు కొనుగోలు చేసింది, సతీష్‌రెడ్డికి ఎంతకు అమ్మింది, ఇందులో బాబుకు ముట్టిందెంత వంటి వివరాలపై సీబీఐ ఆరా తీస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలనూ అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

జరిగిందిదీ..: 1989లో బాబు కుటుంబం రామా అగ్రికల్చరల్ ఫామ్స్ పేరిట కొండాపూర్‌లో 3.27 ఎకరాలు కొనుగోలు చేసింది. బాబు భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్, తల్లి అమ్మణ్ణమ్మ రామాలో భాగస్వాములు. ఆ భూములనే సతీష్‌రెడ్డి, దీప్తిలకు 2000లో విక్రయించారు. వాటి మాటున కోట్ల ముడుపులు బాబుకు ముట్టాయన్న కోణమే ఇక్కడ కీలకంగా మారింది. మార్కెట్‌లో అప్పట్లో ఎకరా రూ.12 లక్షలున్న ఆ భూమిని ఎకరా రూ.కోటికి కొనుగోలు చేశారు. దానికి కూతవేటు దూరంలో అదే ఏడాది మదీనాగూడలో అమ్మణ్ణమ్మ ఎకరా రూ.8 లక్షల చొప్పున భూమిని కొన్నారు! ఈ క్రయ విక్రయాల తర్వాత కూడా కథ ఇంకా నడిచింది. ఆ 3.27 ఎకరాల డెవలప్‌మెంట్ కోసం దివ్యశ్రీ గ్రూప్‌తో సతీష్‌రెడ్డి కుటుంబం ఒప్పందం చేసుకుంది. అదే దివ్యశ్రీ గ్రూపునకు బాబు ప్రభుత్వం హైటెక్‌సిటీ లే ఔట్‌లో 7 ఎకరాలు కేటాయించారు.

సీబీఐ విచారణపై హైకోర్టుకు మురళీమోహన్

బాబు, ఆయన కుటుంబీకులు, బినామీల అక్రమాస్తులపై సీబీఐ విచారణకు ఆదేశాలను ఎత్తివేయాలంటూ జయభేరి అధినేత, టీడీపీ నేత మురళీమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మధ్యంతర ఉత్తర్వులపై బాబు బినామీలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులోనే తేల్చుకోవాలని కోర్టు స్పష్టం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను ఎత్తేయాలంటూ బాబు, ఆయన బినామీలు రామోజీ, నామా నాగేశ్వరరావు, సీఎం రమేశ్ ఇప్పటికే పిటిషన్లు వేయగా, తాజాగా మురళీమోహన్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్ష సాధింపునకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిటిషన్ చేశారని పేర్కొన్నారు. భూ కేటాయింపుల ద్వారా బాబు తనకు లబ్ధి చేకూర్చారనడం అవాస్తవమన్నారు.

 http://www.sakshi.com/main/Fullstory.aspx?catid=276870&Categoryid=1&subcatid=33

అందరూ దొంగలే ! -- సబిత చెబితేనే.. ...... -- కోర్టులో గుట్టు విప్పిన శ్రీలక్ష్మి

సబిత చెబితేనే..
కోర్టులో గుట్టు విప్పిన శ్రీలక్ష్మి
బెయిల్ పిటిషన్‌లో సంచలన వివరాలు

మంత్రి ఆమోదించాకే జీవోల జారీ
రేపో మాపో ఓఎంసీ కేసులో చార్జిషీటు
మంత్రి ప్రస్తావన తేవడం అనివార్యం?
నేను రాక ముందే ఓంఎసీకి లీజులు
రాజగోపాల్ ఇచ్చిన జాబితానే కేంద్రానికి..
తవ్వకాలు, పర్మిట్లు, రవాణాతో సంబంధం లేదు
జీవో, ముసాయిదాపై నా సంతకాలు లేవు
పిటిషన్‌లో శ్రీలక్ష్మి స్పష్టీకరణ
హైదరాబాద్, నవంబర్ 30 : 'నేను చేసింది తప్పయితే... ఆ తప్పును మంత్రి సబితా ఇంద్రారెడ్డే చేయించారు. ఆమె ఆమోదంతోనే అంతా జరిగింది'... అక్రమ గనుల కేసులో అరెస్టయిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సారాంశమిది!

దీంతో 'అన్న' కాలంలో జరిగిన అక్రమాల తంతు 'చేవెళ్ల చెల్లెమ్మ'ను మరింత బలంగా చుట్టుముడుతోంది. శ్రీలక్ష్మి రిమాండ్ డైరీలో సీబీఐ మంత్రి ప్రస్తావన తీసుకురావడమే సంచలనం సృష్టించింది. బుధవారం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో శ్రీలక్ష్మి మరిన్ని సంచలనాత్మక సంగతులు బయటపెట్టారు. 'ఏదైనా తప్పు జరిగిందంటే అందుకు బాధ్యత నాది కాదు. పైస్థాయిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కింది స్థాయిలో ఉన్న నాటి గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్‌లదే ఈ పాపం. నేను నిమిత్తమాత్రురాలిని' అని శ్రీలక్ష్మి చెప్పకనే చెప్పారు.

వారి పేర్లు ప్రస్తావించనప్పటికీ... హోదాలతోనే మొత్తం వివరాలు వెల్లడించారు. తాను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టక ముందే ఆ గనులను ఓఎంసీకి కేటాయించారని తెలిపారు. "నేను 2006 మే 17వ తేదీన పరిశ్రమలు, గనులశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను. రాష్ట్ర ప్రభుత్వం 2005 నవంబర్ 4వ తేదీనే ఓఎంసీకి లీజు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని ఓఎంసీకి లేఖ ద్వారా తెలియజేసింది'' అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 'షార్ట్ లిస్ట్' చేసిన దరఖాస్తులను పంపించానని తెలిపారు.

ఆ జాబితా కూడా తాను తయారు చేయలేదని, రాజగోపాల్ పంపిన దరఖాస్తుదారుల పేర్లనే తాను ప్రాసెస్ చేశానని వివరించారు. లీజులు ఆమోదించి, షరతులు విధించాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని తెలిపారు. ' నాపై వచ్చిన ఆరోపణలన్నీ 151, 152 జీవోలకు సంబంధించినవే. అప్పటికే ప్రభుత్వం ఆమోదించిన చేసిన ఫైళ్లపైనే నేను జీవోలు జారీ చేశాను. అప్పటి గనుల శాఖ మంత్రి సబిత వద్దకు ఫైళ్లు పంపి, ఆమె ఆమోదించిన తర్వాత, ఆమె ఆదేశాల మేరకే జీవోలు జారీ చేశాను. కార్యదర్శిగా నా పేరిట జీవోలు జారీ అయినప్పటికీ... ముసాయిదా జీవోలపైగానీ, జీవోలపైగానీ నా సంతకాలు ఎక్కడా లేవు'' అని శ్రీలక్ష్మి నాటి వివరాలను పూసగుచ్చినట్లు వివరించారు.

వెరసి... 'నేరం నాది కాదు! సబితది' అని పరోక్షంగా నాటి గనుల మంత్రి, నేటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని... వైఎస్ సర్కారును వేలెత్తి చూపించారు. 'క్యాప్టివ్ మైనింగ్' అనే పదాలను నేను తొలగించానన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. "ఓబుళాపురం గనుల్లో తవ్వకాలు, ఖనిజ రవాణా, ఎగుమతి, పర్మిట్లు వీటిలో దేనితోనూ నాకు సంబంధంలేదు'' అని చెప్పారు. ఇది బెయిల్ పిటిషన్ అయిప్పటికీ... కాస్త అటూ ఇటుగా శ్రీలక్ష్మి వాంగ్మూలం ఇచ్చినంత పని చేశారు. అదికూడా... ఈ కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ కోర్టు ముందు, లిఖితపూర్వకంగా సంచలనాత్మక విషయాలు విప్పి చెప్పారు. ఈ నేపథ్యంలో 'ఎవరి ఆదేశాల మేరకు' గాలి గనుల ఫైళ్లను అంత వేగంగా ఆమోదించాల్సి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత కూడా సబితపై పడింది.

ఓఎంసీ కేసులో మరో రెండు రోజుల్లో చార్జిషీటు సమర్పించనున్న నేపథ్యంలో... శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్న వివరాలు కీలకంగా మారాయి. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలను గమనిస్తే... అభియోగ పత్రంలో సబిత ప్రస్తావనతోపాటు, ఓఎంసీకి గనుల కేటాయింపులో ఆమె పాత్ర గురించి వివరించడం తథ్యమని భావిస్తున్నారు. అదే జరిగితే... సబిత 'గనుల ఊబి'లో కూరుకుపోయినట్లే. ఈ కేసులో సీబీఐ సుమారు పదివేల పేజీలతో సీబీఐ చార్జ్‌షీటు దాఖలు చేయనుంది. ఈ కేసులో మరికొందరు అధికారుల ను సహ నిందితులుగా చేర్చే అవకాశం కనిపిస్తోంది. 

 https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/dec/1/main/1main1&more=2011/dec/1/main/main&date=12/1/2011

అందరూ దొంగలే ! -- ఎన్ని 'మేళ్ల''కు ఇన్ని కోట్లు? ---- జగన్ కంపెనీల్లో రూ.504 కోట్ల పెట్టుబడి

ఎన్ని 'మేళ్ల''కు ఇన్ని కోట్లు?
జగన్ కంపెనీల్లో రూ.504 కోట్ల పెట్టుబడి

'వాన్‌పిక్' అనుమతులకు ప్రతిఫలమా?
లేక.. హవాలా డబ్బును ఇలా తరలించారా?
నిమ్మగడ్డపై సీబీఐ నజర్
హైదరాబాద్, నవంబర్ 30 : సముద్ర తీరం నుంచి తాగునీటి నల్లా దాకా.... దేనినీ వదలడంలేదు. ఏ కోణాన్నీ విస్మరించడంలేదు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ 'శోధన' చురుగ్గా సాగుతోంది. లోటస్ పాండ్‌లో యువనేత ఇంటి కొళాయిల కథతోపాటు, వైఎస్‌కు సన్నిహితుడైన పెన్నా ప్రతాప రెడ్డి కంపెనీలకు నీటి వసతి కల్పనపైనా దృష్టి సారించింది.

అన్నింటికంటే ముఖ్యంగా... జగన్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్‌పై 'నజర్' వేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన 12వ నిందితుడు. సీబీఐ అధికారులు ఆయనను ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించారు. జగన్ కంపెనీల్లో అత్యధిక పెట్టుబడులు పెట్టింది ఆయనే. భారతి సిమెంట్స్, కార్మెల్ ఏషియా, సండూర్ పవర్, జగతి పబ్లికేషన్స్ తదితర కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ దాదాపు రూ.504 కోట్లు పెట్టుబడి పెట్టారు. దీనిని సీబీఐ 'అసాధారణ' విషయంగా పరిగణిస్తోంది.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వివాదాస్పద ప్రాజెక్టు 'వాన్‌పిక్' ప్రధాన ప్రమోటర్ నిమ్మగడ్డ ప్రసాద్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిబంధనల సడలింపు, రాయితీలు, అనుమతుల విషయంలో జరిగిన 'మేలు'కు ప్రతిఫలంగానే నిమ్మగడ్డ ఈ పెట్టుబడి పెట్టారా? అనే సందేహాలు ఉండగానే... 'ఎంత మేలు జరిగితే మాత్రం, రూ.504 కోట్లు పెట్టుబడి పెడతారా? ఇందులో మరేదో మతలబు ఉంది' అనే అనుమానం సీబీఐకి కలుగుతోంది. ఇతరత్రా హవాలా మార్గంలో జగన్‌కు చేరాల్సిన డబ్బును... నిమ్మగడ్డ ప్రసాద్ కంపెనీల ద్వారా వైట్ చేయించుకున్నారా? అనే కోణంలోనూ సీబీఐ విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది.

ఎన్నెన్ని కోట్లు...
సండూర్ పవర్ కంపెనీలో నిమ్మగడ్డ ప్రసాద్ ఒక్కో షేరు రూ.650 చొప్పున 21.42 లక్షల షేర్లను రూ.140 కోట్లతో కొన్నారు. కార్మెల్ ఏసియాలో ఒక్కో షేరు రూ. 252 చొప్పున కొన్నారు. ఇందులో రూ.20 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. ఇక... భారతి సిమెంట్స్‌లో ఏకంగా 244 కోట్ల పెట్టుబడి పెట్టారు. జగతి పబ్లికేషన్స్‌లో రూ.100 కోట్లు గుమ్మరించారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వి విధ కంపెనీల ద్వారా ఈ పెట్టుబడులు ప్రవహించాయి.

 https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/dec/1/main/1main6&more=2011/dec/1/main/main&date=12/1/2011

అందరూ దొంగలే ! --- ఆరగింపులో నారా-వన్ --- ఐఎంజీ కుంభకోణంలో... బాబు అబ్రకదబ్ర! : Chandra Babu - Chanakya of Corruption

Chandra Babu  -  Chanakya of Corruption 
 
ఆరగింపులో నారా-వన్
ఐఎంజీ కుంభకోణంలో... బాబు అబ్రకదబ్ర!
*నాలుగు రోజుల కంపెనీకి... 850 ఎకరాలు
*రూ.8,500 కోట్ల భూమి.. రూ.4 కోట్లకే అప్పగింత
*ఆపద్ధర్మ సీఎం హోదాలో బినామీ బిల్లీరావుకు పందేరం
*రూ.50 వేలకే ఎకరం చొప్పున రాసిచ్చిన చంద్రబాబు
*అప్పట్లోనే దాని మార్కెట్ విలువ రూ.2 కోట్లు
*తన భార్య భూమిని అదే ధరకు అమ్ముకున్న బాబు
*అనామక కంపెనీతో నాలుగే రోజుల్లో ఒప్పందం
*బాబు ఆజ్ఞానుసారం శరవేగంగా కదిలిన ఫైలు
*ఐఎంజీ గురించి తెలుసుకునే ప్రయత్నమే శూన్యం
*కేబినెట్‌కు కూడా తెలియకుండా కేటాయింపులు
*పారదర్శకత లోపించిందన్న నాటి ప్రభుత్వ కార్యదర్శి
*బాబుది ఆశ్రీత పక్షపాతమంటూ హైకోర్టుకు అఫిడవిట్

హైదరాబాద్, న్యూస్‌లైన్:అది 2003 ఆగస్టు 5. ‘ఐఎంజీ భారత’ అంటూ హైదరాబాద్‌లో ఓ కంపెనీ రిజిస్టరయింది. అప్పటిదాకా దానికొక ఆఫీసు లేదు. పనీపాటా లేవు. ఫక్తు అనామక కంపెనీ. కాకపోతే దానికి ఉన్నదల్లా ఒక్కటే! నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దన్ను! ఆ కంపెనీ అధిపతి అహోబలరావు అలియాస్ బిల్లీరావు కూడా వేరెవరో కాదు. చంద్రబాబు ఆత్మ. అంటే బిల్లీ చేతికి ఏదొచ్చినా... అది బాబు జేబులో వాలినట్లే. ఫక్తు బినామీ అన్నమాట.

ఇంకేం! తెరవెనక కథలు చకచకా నడిచాయి. దస్త్రాలు శరవేగంతో కదిలాయి. ఆగస్టు 9 కల్లా ఓ ఒప్పందం కుదిరిపోయింది. ఫలితం... నాలుగు రోజుల కంపెనీకి అక్షరాలా ఎనిమిది వందల ఏభై ఎకరాల భూమిని... అది కూడా అత్యంత ఖరీదైన హైదరాబాద్ శివారు ప్రాంతంలో కట్టబెట్టేశారు. అప్పటికే ఎకరా 2కోట్లు పలుకుతున్న 850 ఎకరాలను... కేవలం ఎకరా రూ.50 వేల చొప్పున రాసిచ్చేశారు. ఇది జరిగిన మూడేళ్లకే అక్కడి భూమి ఎకరా రూ.25 కోట్లు కూడా పలకటం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. బాబు ముందుచూపును ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే!!

పోనీ చంద్రబాబు అక్కడితో ఆగారా అంటే... ససేమిరా లేదు. హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన బంజారాహిల్స్‌లో ఆఫీసు కోసం తన జేబు సంస్థకు మరో 5 ఎకరాలిచ్చేందుకూ సిద్ధపడ్డారు. ఇంకా చిత్రమేంటంటే... గచ్చిబౌలి నుంచి బంజారాహిల్స్ వరకు ఈ మధ్యలో ఆ సంస్థ ఎక్కడ ఎంచుకుంటే అక్కడ ఐదెకరాలిస్తానని చెప్పారు. ఆ సంస్థ బంజారాహిల్స్‌ను ఎంచుకోగా... పచ్చజెండా ఊపేశారు.
ఇక్కడిక్కూడా చంద్రబాబు ఫుల్‌స్టాప్ పెట్టలేదు. తన జేబు సంస్థకు మరిన్ని తాయిలాలు కురిపించారు. హైదరాబాద్‌తో పాటు శివార్లలో నిర్మించిన క్రీడా మైదానాలను ఐఎంజీకి 45 ఏళ్ల దీర్ఘకాలిక లీజుకు కట్టబెట్టాలని బాబు నిర్ణయించారు. అయితే లీజు మొత్తం ఎంతన్నది మాత్రం జీవో 11లో ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంకా ఈ జీవోలో పేర్కొన్న దారుణమైన విషయాలేంటంటే...

*ఐఎంజీకి అప్పగించే క్రీడా మైదానాల నిర్వహణ ఖర్చులను ఐదేళ్ల పాటు ప్రతి పైసాతో సహా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. అందుకోసం ఏటా రూ.2.5 కోట్ల చొప్పున రూ.12.5 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం తరఫున కేటాయిస్తారు.

*ఈ స్టేడియంలను 45 ఏళ్ల కాలంలోపలే... అంటే తనకు ఇష్టం వచ్చినపుడు ఐఎంజీ కొనుగోలు చేయవచ్చు. ఈ కొనుగోలుకు సంబంధించి పూర్తి విచక్షణ హక్కులన్నీ ఐఎంజీకే ఉంటాయి. దానిప్రకారం కొనుగోలు చేసేనాటికి ఆ స్టేడియం తాలూకు భూమి, భవనం ధర, నిర్వహణ, అభివృద్ధి ఖర్చుల ఆధారంగా ఐఎంజీనే దానికి విలువ కడుతుంది. ఆ విలువ ఆధారంగా అది తనకు నచ్చితే ఆ స్టేడియంలను సొంతం చేసుకుంటుంది.

*ఈ ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వం గానీ, ప్రభుత్వ సంస్థలు గానీ సహకరించకపోయినా సరే ఒప్పందం అమల్లోనే ఉం టుం ది. ఐఎంజీ తనకున్న హక్కుల మేరకు నిర్ణయం తీసుకోవచ్చు

*సాధారణంగా విద్యా సంస్థలకు కల్పించే రాయితీలు, సౌకర్యాలన్నిటినీ ఐఎంజీకి వర్తింపజేశారు. పదేళ్ల పాటు వినోద పన్ను మినహాయించారు. తొలి మూడేళ్లకూ కరెంటు, నీటి బిల్లులు రద్దు చేశారు. తర్వాతి నాలుగేళ్లకూ వాటిలో 25 శాతం రాయితీ ఇచ్చారు.

చంద్రబాబు ఇవన్నీ చేసింది ఫుల్‌టైమ్ ముఖ్యమంత్రిగా కాదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ...!?

అతిక్రమణల వెల్లువ...
ఇక్కడ చంద్రబాబు తన జేబు సంస్థ కోసం ఎన్ని నిబంధనలను అతిక్రమించారని ప్రశ్నించుకుంటే... ‘అమల్లో ఉన్న అన్నిటినీ’... అని ఒక్కమాటలో చెప్పొచ్చు. ఎలాగంటే... ఎన్నికలు సమీపిస్తున్నాయి కనక ఒకవేళ చంద్రబాబు తాను తిరిగి అధికారంలోకి రాకపోతే ఎలాగన్నది ముందే ఊహించారు. అందుకే ఏ ప్రభుత్వమూ, ఏ ప్రభుత్వ సంస్థా ఈ ఒప్పందం విషయంలో జోక్యం చేసుకోకుండా... దీన్ని రద్దు చేసే అవకాశం లేకుండా ముందస్తు కళ్ళేలు వేశారు. ఐఎంజీకే అన్ని హక్కులూ ఉంటాయంటూ తన కుట్ర బుద్ధి బయటపెట్టుకున్నారు.

నిజానికి ఈ సంస్థకు చంద్రబాబు కేటాయించింది కేవలం 850 ఎకరాలు మాత్రమే కాదు. రాజధానిలో అప్పటికే వందల కోట్లు వెచ్చించి కట్టిన క్రీడా మైదానాలను కూడా. వాటితో జతపడి ఉన్న వందలాది ఎకరాల భూముల్ని కూడా. ఈ స్టేడియాల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఎంతకు కావాలంటే అంతకు కొనుగోలు చేసే అవకాశాన్ని బాబు తన బినామీ సంస్థకు చాలా ఉదారంగా కల్పించేశారు.

అంతేకాకుండా మైదానాల నిర్వహణ ఖర్చును నయాపైసాతో సహా ఐదేళ్లపాటు ప్రభుత్వమే భరించటం. అంటే ఈ ఐదేళ్లలో ఏ మైదానం లాభసాటిదో, ఏది లాభం కాదో బిల్లీబాబుకు తెలియనే తెలుస్తుంది. దాంతో లాభసాటి మైదానాల్ని తనకు ఇష్టం వచ్చిన రేటుకు ఆ వెంటనే సొంతం చేసుకుంటారన్న మాట. ఇదీ బాబు ఒప్పందపు లోగుట్టు. అందుకే... బాబు హయాంలో జరిగిన అక్రమాల తీవ్రతను తెలుసుకోవాలంటే ఐఎంజీ కుంభకోణం ఒక్కటి చాలని అంతా చెబుతుంటారు.

బిల్లీ పేరుప్రఖ్యాతులు బాబుకే ఎరుక...
బిల్లీరావు పెద్ద పేరున్న వ్యక్తేమీ కాదు. క్రీడా రంగంలో అనుభవశాలి కూడా కాదు. కానీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ)లో 2003 ఆగస్టు 5న ఐఎంజీ అకాడమీస్ భారత రిజిస్టరయింది. అది కూడా లక్ష రూపాయల మూలధనంతో. దాన్లో 99 శాతం వాటా బిల్లీ రావుది కాగా మిగిలిన ఒక్క శాతం ఆయన సోదరుడు ప్రభాకరరావు అలియాస్ పేటరావుది. రిజిస్టరైన మర్నాడే.. అంటే ఆగస్టు 6న నాటి యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి 111080/ఎస్1/03 నంబరు నోట్ ఫైల్‌ను ముసాయిదా ఎంఓయూ ఆమోదానికి పంపారు. ఆ నోట్‌ను నాటి కేబినెట్ మంత్రులు నలుగురు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదే రోజున ఆమోదించారు. మర్నాడు... అంటే 7న ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శి ఓ నోట్‌ను సర్క్యులేట్ చేశారు. ఐఎంజీఏ గురించి అందులో వివరించారు. సీఎం, మంత్రివర్గ ఉపసంఘం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.... ఇలా పలు స్థాయిల్లో సమావేశాలు, చర్చలు జరిగినట్టు ఆ నోట్‌లో పేర్కొన్నారు. ముసాయిదా ఎంఓయూ కోసం వచ్చిన ఫైల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు 8వ తేదీన ఆమోదించారు.

నిజానికి పలు చర్చలు, సమావేశాలు జరిగినట్లు నోట్‌లో పేర్కొన్నప్పటికీ, వాస్తవంగా ఎటువంటి చర్చలు, సమావేశాలు జరగనే లేదు. పూర్తిస్థాయి చర్చల తరువాతే నిర్ణయం తీసుకున్నామని అందర్నీ నమ్మించేందుకే నోట్‌లో అలా పేర్కొన్నట్టు ప్రభుత్వమే తరువాత ఓ అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తెలియజేసింది. ఇంకో దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఆగస్టు 6కు ముందు అసలు ఏం జరిగిందనే విషయాలేవీ కూడా రికార్డుల్లో ఎక్కడా లేకపోవటం. అంటే అసలు ఐఎంజీ రంగప్రవేశం ఎలా జరిగింది..? ఆ కంపెనీతో ఎవరెవరు చర్చలు జరిపారు..? అసలు బిల్లీరావు ఎవరు..? అనే విషయాలేవీ అధికారులెవరికీ తెలియదన్న మాట. దీన్ని బట్టి ఐఎంజీ, బిల్లీరావుల గురించి బాబుకు మాత్రమే తెలుసని అర్థం కావటం లేదూ!

రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదు...
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, గచ్చిబౌలిలో 400 ఎకరాలను కారుచౌకగా ఎకరా రూ.50 వేల చొప్పున ఐఎంజీకి విక్రయించేందుకు బాబు ప్రభుత్వం 2004 ఫిబ్రవరి 9న జీవో ఎంఎస్ నంబర్ 11ను జారీ చేసింది. బిల్లీరావుకు లబ్ధి చేకూర్చేలా ఇందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం... ఆ 400 ఎకరాలకు బిల్లీ రావు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదు. మామిడిపల్లిలోని మిగతా 450 ఎకరాలనూ అదే ధరకు ఐఎంజీకి విక్రయిస్తున్నట్లు జీవో 11లో ప్రభుత్వం పేర్కొంది. పైగా ఐఎంజీ కార్యాలయం కోసం బంజారాహిల్స్‌లో ఐదెకరాలు కేటాయించేందుకు కూడా అనుమతినిచ్చారు.

ఎకరా రూ.10 కోట్ల భూమి.. రూ. 50 వేలకే!
నేటి మార్కెట్ రేటును బట్టి చూస్తే గచ్చిబౌలి ప్రాంతంలో ఎకరా ధర కనీసం 10 కోట్ల రూపాయలుంది. ఒక దశలో ఇది రూ.25 కోట్ల రూపాయలు కూడా పలికింది. అంటే 400 ఎకరాల ధర ఒకదశలో రూ.10 వేల కోట్లన్న మాట. మామిడిపల్లి భూమిని కూడా కలిపితే ఇది రూ.20 వేల కోట్ల పైమాటే. బంజారాహిల్స్ ప్రాంతంలో ఐదెకరాల విలువ రూ.120 కోట్లు దీనికి అదనం. ఇంతటి విలువైన 855 ఎకరాల భూమిని బిల్లీరావు కంపెనీకి చంద్రబాబు రూ.4 కోట్లకు కట్టబెట్టేశారన్నమాట. ఐఎంజీ కుంభకోణానికి ముందు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అదే ప్రాంతంలో తనకున్న భూమిని ఎకరా రెండు కోట్ల రూపాయలకు విక్రయించారు. అంటే తమ భూములను మార్కెట్ ధరకు అమ్ముకున్న చంద్రబాబు, ప్రభుత్వ భూములను మాత్రం నామమాత్రపు ధరకే తన బినామీకి అప్పగించేశారు. ఇదే ఈ మొత్తం వ్యవహారంలో అతి పెద్ద మోసం.

ఎక్కడిదీ ఐఎంజీ..?
తమ కంపెనీ ఫ్లోరిడాకు చెందిన ఐఎంజీ వరల్డ్ వైడ్ కంపెనీకి అనుబంధమని బిల్లీరావు నమ్మబలికారు. నిజానికి ఫ్లోరిడాలో ఐఎంజీ వరల్డ్‌వైడ్‌కు ఉన్న భూమే 120 ఎకరాలు! అలాంటి కంపెనీకి హైదరాబాద్‌లో 855 ఎకరాలు కట్టబెట్టేందుకు బాబు సిద్ధమయ్యారు! అంతేకాదు. ఫ్లోరిడాలోని ఐఎంజీకీ, ఇక్కడి ఐఎంజీ భారతకూ ఎలాంటి సంబంధమూ లేదని తరువాతి పరిణామాల్లో ఆ సంస్థ స్వయంగా ప్రకటించింది. కాకపోతే ఈ లోపు అబద్ధాన్ని నిజం చేయడానికి బాబు అనుయాయులు, ఆయనకు వత్తాసు పలికే మీడియా ఎన్నో ప్రయత్నాలు చేశారు.

ఐఎంజీ భారత సంస్థ సాక్షాత్తూ స్వర్గం నుంచి భూమ్మీదికి వచ్చినట్లు... దాని రాకతో మొత్తం క్రీడా ప్రపంచమే మారిపోతుందన్నట్లు కలర్ ఇచ్చారు. అంతేతప్ప ప్రభుత్వాధికారులు కూడా ఐఎంజీ గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. బిల్లీరావు కాకమ్మ కథలనే గుడ్డిగా నమ్మారు. భూములు కట్టబెట్టేశారు! ఈ విషయాలన్నింటినీ నాటి యువజన వ్యవహారాల ముఖ్య కార్యదర్శి స్వయంగా ప్రమాణపూర్వక అఫిడవిట్‌లో హైకోర్టు ముందుంచారు. బాబు హయాంలో జరిగిన ఈ వ్యవహారాలన్నింటిలోనూ పారదర్శకత లోపించిందని, ఆశ్రీత పక్షపాతంతో హడావుడిగా ఐఎంజీకి భూములు కట్టబెట్టారని, తద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల మేర నష్టం వాటిల్లిందని అందులో స్పష్టంగా పేర్కొన్నారు.

ఐఎంజీ భూముల స్వాధీనం
విపక్ష నేతగా దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఐఎంజీ, బాబు ప్రభుత్వ అక్రమాలపై తీవ్రంగా పోరాడారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వేసిన మంత్రుల సంఘం ఐఎంజీకి భూ కేటాయింపు అక్రమమని తేల్చింది. దాంతో వాటన్నింటినీ స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఐఎంజీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉంది. ఐఎంజీకి భూ కేటాయింపుల్లో నాటి ప్రభుత్వం, అధికారుల తీరుపై విచారణ సందర్భంగా ధర్మాసనం పలు సందర్భాల్లో ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

కుప్పంలోనూ బిల్లీ సోదరుడే!
చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గంలో ఇజ్రాయెల్ టెక్నాలజీతో చేపట్టిన ప్రాజెక్టులో రూ.19 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగింది. చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో చేపట్టిన ఈ ప్రాజెక్టును బీహెచ్‌సీ ఆగ్రో (ఇండియా) లిమిటెడ్‌కు అప్పగించారు. ఈ కంపెనీలో తన బినామీలు బిల్లీరావు, ఆయన సోదరుడు ప్రభాకరరావు అలియాస్ పేట రావు, మరికొందరు డెరైక్టర్లు. 9,572 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల పెద్ద సంఖ్యలో రైతులు దారుణంగా నష్టపోయారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. కుప్పం ప్రాజెక్టు అక్రమాలపై పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలపతి అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

పూర్తిస్థాయిలో విచారణ జరిపిన జస్టిస్ చలపతి, కుప్పం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని తేల్చారు. దీనిపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. జస్టిస్ చలపతి కమిషన్ నివేదికను మంత్రిమండలి ఆమోదించి, ఆయన సిఫారసు ఆధారంగా సీఐడీ విచారణకు ఆదేశించింది. పేట రావు, బిల్లీరావు తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జస్టిస్ చలపతి తన నివేదికలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగానే, బిల్లీరావు హైకోర్టును ఆశ్రయించారు. బిల్లీరావు పిటిషన్‌ను విచారించిన జస్టిస్ రోహిణి.. సీఐడీ విచారణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్టే ఉత్తర్వులను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చొరవ చూపకపోవడం విశేషం.

బాబు-బిల్లీ బంధం...
ఈ వ్యవహారంలో జరిగిన గోల్‌మాల్, నిబంధనల ఉల్లంఘనలతో పాటు బాబు ప్రమేయంతో పాటు, ఆయనతో తనకున్న ‘అతి సన్నిహిత’ సంబంధాలు తదితరాల గురించి స్వయంగా ఐఎంజీ డెరైక్టర్ అహోబలరావు అలియాస్ బిల్లీరావు నోట వెలువడ్డ పచ్చి నిజాలు గతంలోనే ‘సాక్షి’కి చిక్కాయి. ‘సాక్షి’ రహస్య శోధనలో బిల్లీరావు ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే...
‘‘బాబుకు ఈ కేసు పూర్తి వివరాలు తెలుసు. అర్ధరాత్రి రెండు గంటలకు లేపి అడిగినా కూడా.. ఠక్కున చెప్పేస్తారు. నేను ఏది చెప్పినా.. బాబు 110 శాతం అది కరెక్టని చెప్పి నమ్ముతారు. ఆయనకు చాలా జ్ఞాపకశక్తి ఉంది. నేనెప్పుడూ అబద్ధం చెప్పలేదు. నేనెందుకు అబద్ధం చెప్పాలి..?’’ ‘‘నేను సాధారణంగా అన్ని విషయాలను బాబు దృష్టికి తీసుకెళ్తా.’’
‘‘ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు బాబు ప్రత్యేకంగా ఓ మనిషిని కూడా నియమించారు. బాబును ప్రతిసారీ డిస్ట్రబ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆయన ఏర్పాటు చేసిన మనిషి ఎప్పటికప్పుడు మనకు సమాచారమిస్తారు. మనకు సమస్యేమీ ఉండదు.’’
‘‘బాబుకు, నాకు చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి. బాబుతో డెరైక్ట్‌గా ఫోన్లోనే మాట్లాడ్తాను. నా దగ్గర బాబు సెల్ నంబరుంది. అయినా సెక్యూరిటీ సిబ్బంది ఫోన్ లిఫ్ట్ చేస్తారు. బాబు దగ్గర రెండు ఫోన్లున్నాయి. ల్యాండ్‌లైన్ ఆపరేటర్ నాకు కనెక్ట్ చేస్తారు. బాబు ఎక్కడున్నా నాకు లైన్ కలిపిస్తారు. సాధారణంగా రాత్రి 9.30 గంటలలోపే ఆయనకు ఫోన్ చేస్తాను.’’
‘‘లోకేష్‌బాబుతో గంటలకొద్దీ గడిపాను. అతను కూడా చాలా తెలివైనవాడు. ఆయన నెంబర్ కావాలా.. తీసుకోండి. విదేశాల్లో చదువుకున్నాడు.. పనిచేశాడు. చాలా అనుభవం ఉంది. బాబుతో పోలిస్తే లోకేష్‌ది బాగా దూకుడు స్వభావం. బాబు కూడా అంత దూకుడు కాదు.’’

బిల్లీరావుకు బాబు 45 ఏళ్ల లీజుకు కట్టబెట్టిన స్టేడియాలివే...
1. జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్, గచ్చిబౌలి
2. ఇండోర్ స్టేడియం, గచ్చిబౌలి
3. ఆక్వెటిక్స్ స్టేడియం, గచ్చిబౌలి
4. ఇండోర్ స్టేడియం, సరూర్‌నగర్
5. కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియం, యూసఫ్‌గూడ
6. సాప్ వెల్‌డ్రోమ్, ఉస్మానియా యూనివర్సిటీ
7. షూటింగ్ రేంజ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
8. హాకీ స్టేడియం, గచ్చిబౌలి

కేబినెట్‌కే తెలియకుండా కేటాయింపులు
ఐఎంజీకి భూమి కేటాయిస్తూ ఫైల్‌పై బాబు సంతకం చేయగానే, బిల్లీరావు 2003 ఆగస్టు 9న ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే కంపెనీ రిజిస్టర్ కావడం.. ఫైల్ సిద్ధమవడం.. నలుగురు మంత్రులు ఆమోదించడం.. బాబు సంతకాలు చేయడం.. ఇలా అన్నీ మొత్తం నాలుగంటే నాలుగే రోజుల్లో జరిగిపోయాయి. కంపెనీ రిజిస్టరయిన నాలుగు రోజుల్లోనే.. అదీ లక్ష రూపాయల మూలధనం ఉన్న కంపెనీకి 20వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని, క్రీడా మైదానాల్ని అప్పగిస్తూ ప్రభుత్వం అతి కీలకమైన ఒప్పందం కుదిర్చేసుకుంది.

బహుశా! ఓ అనామక కంపెనీకి ఇంతటి విలువైన ఒప్పందం కుదుర్చుకోవటమనేది దేశ చరిత్రలోనే ఇది తొలిసారి కావచ్చు. ఒప్పందం కుదిరిన మరుక్షణం... భూమి అప్పగింతకు సంబంధించిన ఫైళ్లు శరవేగంగా కదిలాయి! బాబు హయాంలో ఆయన ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఉమా మహేశ్వరరావు ఈ బాధ్యతలన్నింటినీ భుజాలపై వేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలిలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన 400 ఎకరాలు, సరూర్‌నగర్ మండల పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న మామిడిపల్లిలో 450 ఎకరాలను ఎకరా రూ.50 వేల చొప్పున ఐఎంజీకి కేటాయించాలన్నది ఎంఓయూ ముఖ్యోద్దేశం.

ఇది మంత్రివర్గ సమష్టి నిర్ణయమని నాటి సమాచార మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 2003 సెప్టెంబర్ 1న విలేకరుల సమావేశంలో స్వయంగా చెప్పారు. కానీ ఫైలును కేబినెట్ ముందు పెట్టకుండానే భూముల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారన్నది రికార్డులను పరిశీలిస్తే స్పష్టమైంది. తరువాత ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కూడా ఈ విషయం స్పష్టంచేసింది. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఐఎంజీకి ముందే స్వాధీనం చేయాలంటూ అప్పటి రెవెన్యూ కార్యదర్శి డి.సి.రోశయ్య రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ భూమిని బదలాయించేందుకు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వర్గాలు మొదట అంగీకరించలేదు. కానీ చంద్రబాబు తీవ్రంగా ఒత్తిడి చేయటంతో సరేననక తప్పలేదు.

టీడీపీ అబద్ధాల దాడి
ఐఎంజీ భారతపై పిటిషన్లో పేర్కొన్నదంతా అసత్యమేనంటూ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అబద్ధాల దాడి ఆరంభించింది. దీన్లో భాగంగా రెండురోజుల కిందట ఆ పార్టీ ‘ఐఎంజీ-నిజానిజాలు’ అంటూ ఓ పత్రాన్ని, దానికి జతగా ఐఎంజీ వరల్డ్ వైడ్ అధికారి టెడ్ మీక్మా రాసినట్టు చెబుతున్న లేఖను విడుదల చేసింది. దీంతో పాటు గ్రెగ్ ఛాపెల్ కూడా తమ ప్లాన్లు చూసి మురిసిపోయారని, ఐఎంజీ భారతకు స్వయంగా మెయిల్ చేశారంటూ ఒక ఈ-మెయిల్‌ను బయటపెట్టింది. ఇవన్నీ నిజమేనా? అసలు ఈ లేఖలు రాసిందెవరు? ఐఎంజీ భారతకు-ఐఎంజీకి సంబంధం ఉందా? తెలుగుదేశం ప్రచారంలో నిజమెంత? అసలు టీడీపీ ఇన్ని అబద్ధాలు ఎందుకు ఆడాల్సి వస్తోంది?
 http://www.sakshi.com/Main/Fullstory.aspx?catid=274466&Categoryid=1&subcatid=33

అందరూ దొంగలే ! --- రామోజీ! బుద్ధి మాంద్యమా.. బరితెగింపా? : Chandra Babu - Chanakya of Corruption

 Chandra Babu  -  Chanakya of Corruption

అబద్ధపు ఆధారాలతో ‘ఈనాడు’ కుప్పిగంతులు
బుద్ధి మాంద్యమా.. బరితెగింపా?
విజయమ్మ పిటిషన్లో అడిగింది వేరు... రామోజీ చెబుతున్నది వేరు
బాబు ముందస్తుగా సమాచారాన్ని లీక్ చేయడంతోనే రామోజీకి లబ్ధి
బినామీల ద్వారా విలువైన భూములు కారుచౌకగా కొనుగోళ్లు
పాలమాకుల భూముల లావాదేవీలు స్పష్టంగా చెబుతున్న వాస్తవమిది
2006లో సీబీఐ విచారణకు ఆదేశించింది వైఎస్సే
అది కూడా ‘ఈనాడు’ అబద్ధపు రాతల్లో నిజాల్ని నిగ్గు తేల్చేందుకే...
విమానాశ్రయం చుట్టుపక్కల గ్రామాల్లో జరిగిన భూ సేకరణకే పరిమితమైన సీబీఐ విచారణ
అదికూడా 1997 - 1999 మధ్య జరిగిన లావాదేవీలకే
అక్కడ ఎలాంటి అవకతవకలూ జరగలేదని స్పష్టం చేస్తూ నివేదిక
బాబు 5,492 ఎకరాలు కేటాయించడాన్ని తప్పుబట్టిన సీబీఐ
అసలు పాలమాకుల ఊసే లేదు...
కానీ తనకే క్లీన్‌చిట్ వచ్చిందంటూ రామోజీ రంకెలు
{పస్తుత విచారణపై భయంతో... సీబీఐని తప్పుదోవ పట్టించేందుకు ప్రయాస

నిజం నిప్పులాంటిదే! కాకుంటే నిస్సిగ్గుగా దాన్నెలా నీరుగార్చాలో ‘ఈనాడు’ పత్రికాధిపతి రామోజీరావుకు బాగా తెలుసు. వాస్తవాలకు ఎలా పాతరెయ్యాలో... వాటికెలా సమాధి కట్టాలో... అవసరమైతే తనకు వ్యతిరేకంగా ఉన్నదాన్ని కూడా అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఆయనకు చాలా బాగా తెలుసు. మరింత స్పష్టంగా చెప్పాలంటే... ఈ విద్యలన్నీ ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియనే తెలియవు కూడా. తన సొంత పత్రిక ‘ఈనాడు’లో బుధవారం పెద్దపెద్ద అక్షరాలతో ‘‘సీబీఐ నిగ్గుతేల్చిన నిజాన్ని చూడలేరా?’’ అంటూ తనకు తనే క్లీన్‌చిట్ ఇచ్చేసుకుంటూ ఆయన రాసిన రాతల్లోని మర్మం ఇదే. సంబంధం లేని విషయాన్ని ప్రస్తావించి... దానితో తనకే మాత్రం సంబంధం లేదని చెబుతూ ఆయన తప్పుదోవ పట్టిస్తున్నది ఎవరిని? ప్రజలనా? తన పాఠకులనా? లేక ఇప్పటికే విచారణ మొదలుపెట్టిన సీబీఐనా? ప్రజలన్నా... ప్రజాస్వామ్య వ్యవస్థలన్నా రామోజీకి ఎంతటి చిన్నచూపో... వాటిని ఏమార్చగలగటంలో తనపై తనకెంత నమ్మకమో బుధవారం నాటి ‘ఈనాడు’ పతాక కథనం ఒక్కటి చూస్తే తెలిసిపోతుంది. లిటిగేషన్లలో తనకెవ్వరూ సాటిరారని ఇన్నాళ్లూ విర్రవీగిన రామోజీ అక్రమాలపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం విచారణకు ఆదేశించటంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే తన పని మొదలుపెట్టింది. అక్రమాల తీగను లాగుతుండటంతో డొంక కదులుతుందేమోనని భయపడిన రామోజీ... పత్రికను అడ్డంపెట్టుకుని చేస్తున్న వాదనల్లో నిజానిజాలివిగో...

దివంగత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ తన ప్రజాహిత వ్యాజ్యంలో రామోజీపై చేసిన ఆరోపణేమిటంటే... శంషాబాద్ విమానాశ్రయం ఏర్పాటు, అనుమతులకు సంబంధించిన అధికారిక సమాచారం చంద్రబాబు చలవతో జనానికన్నా ముందుగా రాజ గురువుకే తెలిసిందని. దాన్ని ఉపయోగించుకున్న రామోజీ... అక్కడ వందల ఎకరాల భూముల్ని కొని భారీగా లబ్ధి పొందారని. అంతే తప్ప రామోజీకి అక్కడ భూములున్నాయి కనుక ఆయనకు లబ్ధి చేకూర్చడం కోసం అక్కడ విమానాశ్రయాన్ని ప్రకటించారని కాదు. ఈ తేడాను ‘గుర్తించని’ రామోజీ తప్పుడు వాదనలతో పేజీలకు పేజీలు నింపటమే విచిత్రం.

నిజమే! శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నది 1998 డిసెంబర్లోనే. అప్పటిదాకా అటు రామోజీ ఫిల్మ్ సిటీకి చేరువలోనా... ఇటు శంషాబాద్‌లోనా అంటూ ఊగిసలాడిన చంద్రబాబునాయుడి ప్రభుత్వం చివరకు శంషాబాద్‌వైపే మొగ్గు చూపింది. అంతమాత్రాన దానికి అన్ని అనుమతులూ వచ్చేసి... 1998లోనే పనులు మొదలైపోవటమన్నది జరగలేదు. ఈ స్థలాన్ని అనుకున్నాక కూడా ప్రభుత్వం వివిధ అనుమతుల కోసం ఎదురు చూడక తప్పలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు చాలా ఆలస్యంగా వచ్చాయి. విమాన యాన శాఖ నుంచి 29-5-2000న, పర్యావరణ శాఖ నుంచి 6-3-2003న అనుమతులొచ్చాయి. అంటే అప్పటిదాకా శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఖరారు కానట్లే లెక్క.

రామోజీరావు తన ఉద్యోగుల ద్వారా బినామీ కొనుగోళ్లను మొదలు పెట్టించింది కూడా కేంద్ర విమానయాన శాఖ నుంచి అధికారిక అనుమతి వచ్చిన తర్వాతేనన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. ఎందుకంటే ఎయిర్‌పోర్టుకు అదే కీలకం. అందుకే శంషాబాద్ విషయంలో కూడా ఆ అనుమతి వచ్చాకే... విమానాశ్రయం పరిధిలోకి వచ్చే గ్రామాలను గుర్తిస్తూ 2001 జులై 31న జీవో ఎంస్ నెంబరు 352ను విడుదల చేసింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (హాడా) పరిధిలోకి వచ్చే గ్రామాల్ని స్పష్టంగా గుర్తించింది.

ఖరారుకు ముందే రామోజీ కొనుగోళ్లు...

2000 మే 29న విమానయాన మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ వచ్చాక విమానాశ్రయం ఏర్పాటు తథ్యమని తేలిపోయింది. అప్పటిదాకా తెరవెనక చక్రం తిప్పిన రామోజీ... అది ఖరారు కావటంతో తన ఉద్యోగుల్ని రంగంలోకి దించారు. ఏయే గ్రామాలు విమానాశ్రయం పరిధిలోకి వస్తున్నాయనే జీవో 2001 జూలై 31న విడుదల కాగా... చంద్రబాబు మనసులో మాట లాంటి రామోజీకి దానికన్నా ముందే ఆ వివరాలన్నీ తెలిసిపోయాయి. ఫలితం... 2001 ఫిబ్రవరిలో రామోజీ బినామీలుగా ఆయన ఉద్యోగులు కొల్లి బాపినీడు చౌదరి, గోగినేని రాజేంద్రబాబు, వోరుగంటి గోవిందరావు, వి.వి.రాఘవేంద్రరావు, ఆర్.సుధాకర్ తదితరులు రంగంలోకి దిగారు. అప్పటికే ‘మై హోమ్ గ్రూప్’ అధిపతి జె.రామేశ్వరరావు తన డెరైక్టర్ల పేరిట, బంధుమిత్రుల పేరిట, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపెనీల పేరిట అప్పటికే అక్కడ భూములు కొనిపెట్టి సిద్ధంగా ఉంచారు. పనిలో పనిగా కొన్ని అసైన్డ్ భూముల్ని కూడా కొనేశారు. దాంతో వారి దగ్గర రామోజీ ఉద్యోగులు కోట్ల రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేశారు. 2001 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉద్యోగుల కొనుగోళ్లు పూర్తయిపోయాయి. నిజానికి తన ఉద్యోగుల్ని రంగంలోకి దింపి... ఒకే ప్రాంతంలో అంత పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయాలంటే దానికి ముందస్తు ప్రణాళిక, అమ్మకందార్లతో చర్చించడానికి కొంత సమయం ఇవన్నీ అవసరమవుతాయి. ఎంత లేదన్నా 420 ఎకరాల భూములు కొనుగోలు చేయడానికి... అదికూడా పలువురు ఉద్యోగుల చేత బినామీలుగా కొనిపించడానికి కనీసం ఐదారు నెలల సమయం అవసరం. అంటే కేంద్ర విమానయాన శాఖ నుంచి అనుమతి వచ్చిన తక్షణం రామోజీ రంగంలోకి దిగారన్న మాట.

ఏడాది తిరిగాక రామోజీ కొనుగోళ్లు...
అప్పటికే బినామీలుగా బరిలోకి దిగిన ఉద్యోగులు కోట్ల రూపాయలు పెట్టి భూములు కొనుగోలు చేయడంతో పాటు... భూ వినియోగ మార్పిడికి సంబంధించిన మార్పులన్నీ చేయించేయటంతో రామోజీ స్వయంగా రంగంలోకి దిగారు. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లే ఆ ఉద్యోగులు దరఖాస్తు చేసిన వెంటనే వ్యవసాయ అవసరాలకు వాడాల్సి ఉన్న భూమిని వాణిజ్య అవసరాలకు కూడా వినియోగించుకునేలా మార్పులు చేస్తూ అనుమతులిచ్చారన్నది ఇక్కడ ఎవ్వరికైనా తేలిగ్గా అర్థమయ్యే అంశం. రామోజీ గానీ, ఆయన తనయులు గానీ నేరుగా దరఖాస్తు చేస్తే తమ చేతికి మట్టి అంటుకుంటుందనే భయంతో ముందుగా ఉద్యోగుల చేత కొనుగోళ్లు చేయించి, వారి చేత భూ వినియోగ మార్పిడికి అనుమతి కోరుతూ దరఖాస్తులు చేయించారన్నదీ స్పష్టం. తన చేతికి మట్టి అంటకుండా మై హోమ్ గ్రూప్‌తో అసైన్డ్ భూముల్ని కొనుగోలు చేయించిందీ స్పష్టం. లైన్ క్లియర్ కావటంతో 2002 ఏప్రిల్లో రామోజీరావు, ఆయన తనయులు కిరణ్, సుమన్ నేరుగా రంగంలోకి దిగారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌నూ దించారు. తమ ఉద్యోగుల దగ్గర్నుంచి ఏడాది కిందట వారు ఏ ధరకు కొన్నారో అదే ధర చెల్లిస్తున్నట్లుగా చూపించి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పనిలో పనిగా మధ్యలోని ప్రభుత్వ భూమిని కూడా తమ ఖాతాలో వేసేసుకున్నారు. మొత్తానికీ కంచె వేసేసి, ‘ఎంసీఎఫ్ గార్డెన్స్’ అని బోర్డు పెట్టేశారు.

ఎన్నెన్ని ఉల్లంఘనలో..
ఇదీ... రామోజీ భూముల కథ. ఈ తప్పుడు వ్యవహారమంతా ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చేదాకా లోకానికి తెలియదు. ‘సాక్షి’లో వార్తలు వచ్చిన నేపథ్యంలో అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ప్రభుత్వ భూముల కబ్జాపై అధికారులు నోటీసులిచ్చారు. మొదట బుకాయించిన రామోజీ... చివరకు ప్రభుత్వ భూములు ఉన్న సంగతి తనకు తెలియదని, కావాలంటే వచ్చి చూసుకుని స్వాధీనం చేసుకోవచ్చని అమాయకత్వం నటించారు. అధికారులు కొంతవరకూ సర్వే చేసి... అక్రమాలు నిజమేనని తేల్చినా ఆ తరువాతి చర్యలు ఎందుకనో ఆగిపోయాయి!! తాజా సీబీఐ విచారణతో ఈ అక్రమాలన్నీ బయటపడతాయనే భయంతోనే... సీబీఐ తనకెప్పుడో క్లీన్‌చిట్ ఇచ్చేసినట్లు రామోజీ తప్పుడు కథనాలు రాస్తున్నారన్న అనుమానాలు ఎవ్వరికైనా రాకమానవు.
మై హోమ్ గ్రూప్ ఎందుకు విక్రయించింది?

కొద్దిరోజుల కిందట రామోజీరావు-పాల్మాకుల కుంభకోణంపై ‘సాక్షి’లో వార్తలు వెలువడ్డప్పుడు పిలవని పేరంటం మాదిరిగా మై హోమ్ గ్రూప్ అధిపతి రామేశ్వరరావు తెరపైకి వచ్చారు. రామోజీ తరఫున వకాల్తా పుచ్చుకుని... ‘‘ఆయన మా నుంచే భూములు కొన్నారు. మా సంస్థలే ఆయనకు భూములు విక్రయించాయి’’ అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి మై హోమ్ గ్రూప్ కాస్త పేరున్న రియల్టీ సంస్థ. తనకు వెంచర్లున్న ప్రతి చోటా అపార్ట్‌మెంట్లు లేదా కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించి విక్రయించిందే తప్ప కనీసం ఖాళీ స్థలాల్లో వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించిన దాఖలాలే లేవు!

అలాంటిది శంషాబాద్‌లో విమానాశ్రయం వస్తున్న నేపథ్యంలో అక్కడ ముందే... అంటే 1996, 1997 సంవత్సరాల్లోనే భూములు కొన్న ఈ సంస్థ, వాటిని రామోజీ బినామీలకు ఎందుకు విక్రయించేసిందన్నది ఇప్పటికీ ప్రశ్నే. విమానాశ్రయం ఏర్పాటు ఖరారయ్యాక... విమానయాన శాఖ క్లియరెన్స్ కూడా వచ్చాక ఎందుకో ఈ సంస్థ తన భూములన్నీ అమ్మేసింది. దాదాపు ఎకరం రూ.50 వేలు, రూ.లక్ష చొప్పున కొనుగోలు చేసిన ఈ సంస్థ... ఎకరా రూ.4 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో రామోజీకి విక్రయించేసింది. నిజానికి విమానాశ్రయం ఖరారుతో అప్పటికే అక్కడ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఆఖరికి రైతుల నుంచి సేకరించిన భూములకు కూడా ప్రభుత్వం ఎకరాకు రూ.4 లక్షలు చెల్లించింది! అదే ధరకు మై హోమ్ గ్రూపు రామోజీ ఉద్యోగులకు ఆ భూములు అమ్మేసిందంటే విచిత్రమే!

ఇంకా చిత్రమేంటంటే మైహోమ్ గ్రూపు సంస్థలు రామోజీ బృందానికి ఎకరా రూ.4-5 లక్షల మధ్య విక్రయించగా... మైహోమ్ డెరైక్టర్లు, రామేశ్వరరావు బంధువులు మాత్రం కారుచౌకగా అప్పగించేశారు. ఒక దశలో జి.వెంకటరావు అనే డెరైక్టరైతే 2001 ఫిబ్రవరిలో ఎకరా లక్ష రూపాయల చొప్పున కొని... ఆరు రోజులు గడిచేసరికి అదే ధరకు రామోజీ ఉద్యోగికి అమ్మేశారు. అసలు ఆరు రోజుల భాగ్యానికి ఆయన స్టాంపు డ్యూటీ కూడా చెల్లించి ఆ భూమి ఎందుకు కొన్నారో, రూపాయి కూడా లాభం లేకున్నా అదే ధరకు ఎందుకు విక్రయించేశారో రామోజీకే తెలియాలి. సీబీఐ విచారణలో ఇవన్నీ బయటికొస్తాయన్న భయం రామోజీకి పెరుగుతోందేమో!!!
-సాక్షి ప్రతినిధి, హైదరాబాద్

ఇదీ... సీబీఐ నివేదిక అసలు కథ

2006 సెప్టెంబరు 25: ‘‘పెద్దలా.. గద్దలా?’’ అంటూ వైఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ఈనాడు’లో పతాక స్థాయి వార్త ప్రచురితమైంది. దానికి నాలుగు పేజీల అనుబంధం కూడా తోడయింది.

2006 సెప్టెంబరు 25: నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ రోజు తిరుపతిలో ఉన్నారు. విలేకరులు ఆయన చుట్టూ చేరి ‘ఈనాడు’లో వచ్చిన వార్తను ప్రస్తావించారు. ‘‘దానిపై మేం సీబీఐ విచారణకు ఆదేశిస్తాం. నిజానిజాల్ని నిగ్గుతేల్చమని చెబుతాం’’ అన్నారాయన.

2006 సెప్టెంబరు 28: వైఎస్సార్ తన మాటకు కట్టుబడి సీబీఐ విచారణకు ఆదేశించారు. ‘‘ఔటర్ రింగురోడ్డు, కోకాపేట, మంఖాల్ టౌన్‌షిప్‌లతో పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం భూ సేకరణలో అక్రమాలేమైనా జరిగాయా? ఆ ప్రాజెక్టుల్ని చేపట్టడం ద్వారా ప్రభుత్వం ఎవరికైనా అయాచితంగా లబ్ధి చేకూర్చిందా?’’ అనే అంశాలపై విచారణ జరపాలని స్పష్టం చేశారు. ఫలితంగా ‘జీవో నంబరు 240’ విడుదలయింది.

2006 అక్టోబరు 20: సీబీఐ కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది. 2007 మే 31వ తేదీ వరకు విచారణ కొనసాగింది.

2007 జులై 3: విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, మంఖాల్ టౌన్‌షిప్, కోకాపేట వ్యవహారాలన్నిటిపై విచారణ జరిపిన సీబీఐ... ప్రతి అంశాన్నీ స్వతంత్రంగా విడిగానే పరిశీలించింది. తదనంతరం అన్నిటికీ వేరువేరు నివేదికలు అందజేసింది. ‘ఈనాడు’ రాతలు తప్పుల తడకలని తేల్చింది. భూ సేకరణలో అవకతవకలేవీ జరగలేదని, కాబట్టి కేసును మూసేయవచ్చంటూ సిఫారసు చేసింది.
ఇదండీ.. సంగతి. అంటే ‘ఈనాడు’ రాసిన తప్పుడు కథనాలపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించి సీబీఐ విచారణకు ఆదేశిస్తే... రామోజీరావు రాసినట్లుగా అక్కడ అవకతవకలేవీ జరగలేదని సీబీఐ నిర్ధారిస్తే... దాన్నిపుడు రామోజీ తనకు అనుకూలంగా వచ్చిన నివేదికగా ప్రచారం చేసుకుంటున్నారన్నమాట!!!. ఇంతకన్నా ఘోరం ఇంకేదైనా ఉంటుందా? ఇంతకన్నా దిగజారుడుతనం ఎక్కడైనా కనిపిస్తుందా? ఇంతకన్నా బరితెగింపు ఇంకెవరికైనా సాధ్యమవుతుందా?

సీబీఐ నివేదికలోని ఈ పేరా చూడండి...
‘‘విచారణలో భాగంగా 1997 నుంచి 1999 వరకు అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలోని శంషాబాద్, మక్తా బహదూర్ అలీ, గొల్లపల్లి కుర్ద్, గొల్లపల్లి కలాన్, మామిడిపల్లి, మంఖాల్, శ్రీనగర్ గ్రామాల్లో ఐదెకరాలు, అంతకన్నా పైబడి జరిగిన భూముల క్రయవిక్రయాలన్నిటినీ పరిశీలించాం. మంఖాల్‌లో 30, శ్రీనగర్‌లో 4, చిన్న గొల్లపల్లిలో 4, మక్తా బహదూర్ అలీలో 4, మామిడిపల్లిలో 8 లావాదేవీలు కనిపించాయి. శంషాబాద్‌లో ఒక లావాదేవీ బయటపడింది. మన్నెగూడ, రషీద్‌గూడ, ఖాజాగూడ గ్రామాల్లో ఇలాంటి లావాదేవీలేవీ జరగలేదు. పెపైచ్చు ఈ లావాదేవీలతో ఏ వీఐపీకీ సంబంధం లేదని తేలింది. దీనికి తోడు ఆయా గ్రామాల్లో ఐదెకరాల కన్నా ఎక్కువ భూమిని కలిగి ఉన్న 13 మందిని పిలిచి విచారించాం కూడా. వారికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని తేలింది’’

సీబీఐ తన నివేదికలో ఇంత స్పష్టంగా చెబుతున్నా రామోజీ ఎందుకు రంకెలేస్తున్నారు?

ఈ గ్రామాల్లో పాల్మాకుల పేరే లేదు కదా? అక్కడ భూములు కొన్న రామోజీ... తనకే సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చినట్టు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?

ఐదెకరాల కన్నా ఎక్కువ భూమిని కలిగి ఉన్న 13 మందిని పిలిచి విచారించినట్టు సీబీఐ చెబుతోంది. మరి తన పేరిట, తన కుమారుల పేరిట, కంపెనీ పేరిట ఏకంగా 421 ఎకరాలు కలిగి ఉన్న రామోజీని సీబీఐ పిలిచిందా? ఆయన సీబీఐ ఎదుట హాజరయ్యారా? లేనపుడు తనకు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చేసినట్లు పేజీలకు పేజీలు ఆ రాతలెందుకు?

సీబీఐ తాను కేవలం 1997 నుంచి 1999 మధ్య జరిగిన వ్యవహారాలనే పరిశీలించినట్లు చెబుతున్నా... ‘‘1999 నుంచి 2006 వరకూ జరిగిన అన్ని వ్యవహారాలపై సీబీఐ విచారణ జరిపింది’’ అంటూ రామోజీ అబద్ధాలెందుకు చెబుతున్నారు?

తాము విచారించిన గ్రామాల్లో వీఐపీలెవరికీ ఐదెకరాలకు మించి భూములు లేవని సీబీఐ చెబుతోంది. అంటే రామోజీ భూములు కొన్న గ్రామాన్ని విచారించలేదనే కదా అర్థం! లేకుంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఈ రాష్ట్రాన్ని అనధికారికంగా శాసిస్తున్న రామోజీ వీఐపీ కాదనా?


బాబు అంత భూమి ఎందుకిచ్చారు?
అసలు శంషాబాద్ విమానాశ్రయానికి అంత భూమి అవసరం లేదని, అయినా ఎందుకు కేటాయించారని వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ ప్రశ్నిస్తూనే వచ్చింది. దానికి తగ్గట్టు సీబీఐ తన విచారణలో కూడా ఆ విషయాన్ని స్పష్టంగా బయటపెట్టింది. ‘‘విమానాశ్రయానికి 3,000 ఎకరాలు సరిపోతాయని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టంగా చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకనో ఆ సిఫారసును పక్కనబెట్టింది. 5,492 ఎకరాల భూమిని కట్టబెట్టింది’’ అని సీబీఐ స్పష్టంగా పేర్కొంది. నిజానికి విమానాశ్రయం ఏర్పాటు చేసిన ప్రాంతంలో ప్రభుత్వానికి సొంతంగా 3,574 ఎకరాల భూమి ఉంది. దీనికి తోడు ఆయా గ్రామాల్లో పట్టాదారుల నుంచి 1,918 ఎకరాలను సేకరించింది. వారికి ఎకరాలకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లిస్తామనటంతో వారు ఎదురుతిరిగారు. చివరకు ప్రభుత్వం దిగి వచ్చి ఎకరాకు రూ.4 లక్షల వరకు చెల్లించాల్సి వచ్చింది. దీనిక్కూడా కొందరు నిరాకరించారు. ప్రభుత్వం గనక విమానాశ్రయం స్థలాన్ని ప్రభుత్వానికున్న 3,500 ఎకరాలకైనా పరిమితం చేసి... అవసరాల మేరకు భూమిని సేకరించాల్సి వస్తే వారికి ఆ పక్కనే ‘భూమికి భూమి’ కేటాయించి ఉంటే వారిక్కూడా న్యాయం జరిగేదన్న వాదన అప్పట్లో బలంగా వినిపించింది. కానీ బాబు ప్రభుత్వం ఎందుకనో దాన్ని పెడచెవిన పెట్టింది.
   



http://www.sakshi.com/Main/Fullstory.aspx?catid=276787&Categoryid=1&subcatid=33