Thursday, 1 December 2011

అందరూ దొంగలే ! -- సబిత చెబితేనే.. ...... -- కోర్టులో గుట్టు విప్పిన శ్రీలక్ష్మి

సబిత చెబితేనే..
కోర్టులో గుట్టు విప్పిన శ్రీలక్ష్మి
బెయిల్ పిటిషన్‌లో సంచలన వివరాలు

మంత్రి ఆమోదించాకే జీవోల జారీ
రేపో మాపో ఓఎంసీ కేసులో చార్జిషీటు
మంత్రి ప్రస్తావన తేవడం అనివార్యం?
నేను రాక ముందే ఓంఎసీకి లీజులు
రాజగోపాల్ ఇచ్చిన జాబితానే కేంద్రానికి..
తవ్వకాలు, పర్మిట్లు, రవాణాతో సంబంధం లేదు
జీవో, ముసాయిదాపై నా సంతకాలు లేవు
పిటిషన్‌లో శ్రీలక్ష్మి స్పష్టీకరణ
హైదరాబాద్, నవంబర్ 30 : 'నేను చేసింది తప్పయితే... ఆ తప్పును మంత్రి సబితా ఇంద్రారెడ్డే చేయించారు. ఆమె ఆమోదంతోనే అంతా జరిగింది'... అక్రమ గనుల కేసులో అరెస్టయిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సారాంశమిది!

దీంతో 'అన్న' కాలంలో జరిగిన అక్రమాల తంతు 'చేవెళ్ల చెల్లెమ్మ'ను మరింత బలంగా చుట్టుముడుతోంది. శ్రీలక్ష్మి రిమాండ్ డైరీలో సీబీఐ మంత్రి ప్రస్తావన తీసుకురావడమే సంచలనం సృష్టించింది. బుధవారం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో శ్రీలక్ష్మి మరిన్ని సంచలనాత్మక సంగతులు బయటపెట్టారు. 'ఏదైనా తప్పు జరిగిందంటే అందుకు బాధ్యత నాది కాదు. పైస్థాయిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కింది స్థాయిలో ఉన్న నాటి గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్‌లదే ఈ పాపం. నేను నిమిత్తమాత్రురాలిని' అని శ్రీలక్ష్మి చెప్పకనే చెప్పారు.

వారి పేర్లు ప్రస్తావించనప్పటికీ... హోదాలతోనే మొత్తం వివరాలు వెల్లడించారు. తాను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టక ముందే ఆ గనులను ఓఎంసీకి కేటాయించారని తెలిపారు. "నేను 2006 మే 17వ తేదీన పరిశ్రమలు, గనులశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను. రాష్ట్ర ప్రభుత్వం 2005 నవంబర్ 4వ తేదీనే ఓఎంసీకి లీజు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని ఓఎంసీకి లేఖ ద్వారా తెలియజేసింది'' అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 'షార్ట్ లిస్ట్' చేసిన దరఖాస్తులను పంపించానని తెలిపారు.

ఆ జాబితా కూడా తాను తయారు చేయలేదని, రాజగోపాల్ పంపిన దరఖాస్తుదారుల పేర్లనే తాను ప్రాసెస్ చేశానని వివరించారు. లీజులు ఆమోదించి, షరతులు విధించాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని తెలిపారు. ' నాపై వచ్చిన ఆరోపణలన్నీ 151, 152 జీవోలకు సంబంధించినవే. అప్పటికే ప్రభుత్వం ఆమోదించిన చేసిన ఫైళ్లపైనే నేను జీవోలు జారీ చేశాను. అప్పటి గనుల శాఖ మంత్రి సబిత వద్దకు ఫైళ్లు పంపి, ఆమె ఆమోదించిన తర్వాత, ఆమె ఆదేశాల మేరకే జీవోలు జారీ చేశాను. కార్యదర్శిగా నా పేరిట జీవోలు జారీ అయినప్పటికీ... ముసాయిదా జీవోలపైగానీ, జీవోలపైగానీ నా సంతకాలు ఎక్కడా లేవు'' అని శ్రీలక్ష్మి నాటి వివరాలను పూసగుచ్చినట్లు వివరించారు.

వెరసి... 'నేరం నాది కాదు! సబితది' అని పరోక్షంగా నాటి గనుల మంత్రి, నేటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని... వైఎస్ సర్కారును వేలెత్తి చూపించారు. 'క్యాప్టివ్ మైనింగ్' అనే పదాలను నేను తొలగించానన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. "ఓబుళాపురం గనుల్లో తవ్వకాలు, ఖనిజ రవాణా, ఎగుమతి, పర్మిట్లు వీటిలో దేనితోనూ నాకు సంబంధంలేదు'' అని చెప్పారు. ఇది బెయిల్ పిటిషన్ అయిప్పటికీ... కాస్త అటూ ఇటుగా శ్రీలక్ష్మి వాంగ్మూలం ఇచ్చినంత పని చేశారు. అదికూడా... ఈ కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ కోర్టు ముందు, లిఖితపూర్వకంగా సంచలనాత్మక విషయాలు విప్పి చెప్పారు. ఈ నేపథ్యంలో 'ఎవరి ఆదేశాల మేరకు' గాలి గనుల ఫైళ్లను అంత వేగంగా ఆమోదించాల్సి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత కూడా సబితపై పడింది.

ఓఎంసీ కేసులో మరో రెండు రోజుల్లో చార్జిషీటు సమర్పించనున్న నేపథ్యంలో... శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్న వివరాలు కీలకంగా మారాయి. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలను గమనిస్తే... అభియోగ పత్రంలో సబిత ప్రస్తావనతోపాటు, ఓఎంసీకి గనుల కేటాయింపులో ఆమె పాత్ర గురించి వివరించడం తథ్యమని భావిస్తున్నారు. అదే జరిగితే... సబిత 'గనుల ఊబి'లో కూరుకుపోయినట్లే. ఈ కేసులో సీబీఐ సుమారు పదివేల పేజీలతో సీబీఐ చార్జ్‌షీటు దాఖలు చేయనుంది. ఈ కేసులో మరికొందరు అధికారుల ను సహ నిందితులుగా చేర్చే అవకాశం కనిపిస్తోంది. 

 https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/dec/1/main/1main1&more=2011/dec/1/main/main&date=12/1/2011

No comments:

Post a Comment