విజయమ్మ పిటిషన్లో అడిగింది వేరు... రామోజీ చెబుతున్నది వేరు
బాబు ముందస్తుగా సమాచారాన్ని లీక్ చేయడంతోనే రామోజీకి లబ్ధి
బినామీల ద్వారా విలువైన భూములు కారుచౌకగా కొనుగోళ్లు
పాలమాకుల భూముల లావాదేవీలు స్పష్టంగా చెబుతున్న వాస్తవమిది
2006లో సీబీఐ విచారణకు ఆదేశించింది వైఎస్సే
అది కూడా ‘ఈనాడు’ అబద్ధపు రాతల్లో నిజాల్ని నిగ్గు తేల్చేందుకే...
విమానాశ్రయం చుట్టుపక్కల గ్రామాల్లో జరిగిన భూ సేకరణకే పరిమితమైన సీబీఐ విచారణ
అదికూడా 1997 - 1999 మధ్య జరిగిన లావాదేవీలకే
అక్కడ ఎలాంటి అవకతవకలూ జరగలేదని స్పష్టం చేస్తూ నివేదిక
బాబు 5,492 ఎకరాలు కేటాయించడాన్ని తప్పుబట్టిన సీబీఐ
అసలు పాలమాకుల ఊసే లేదు...
కానీ తనకే క్లీన్‌చిట్ వచ్చిందంటూ రామోజీ రంకెలు
{పస్తుత విచారణపై భయంతో... సీబీఐని తప్పుదోవ పట్టించేందుకు ప్రయాస
నిజం నిప్పులాంటిదే! కాకుంటే నిస్సిగ్గుగా దాన్నెలా నీరుగార్చాలో ‘ఈనాడు’ పత్రికాధిపతి రామోజీరావుకు బాగా తెలుసు. వాస్తవాలకు ఎలా పాతరెయ్యాలో... వాటికెలా సమాధి కట్టాలో... అవసరమైతే తనకు వ్యతిరేకంగా ఉన్నదాన్ని కూడా అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఆయనకు చాలా బాగా తెలుసు. మరింత స్పష్టంగా చెప్పాలంటే... ఈ విద్యలన్నీ ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియనే తెలియవు కూడా. తన సొంత పత్రిక ‘ఈనాడు’లో బుధవారం పెద్దపెద్ద అక్షరాలతో ‘‘సీబీఐ నిగ్గుతేల్చిన నిజాన్ని చూడలేరా?’’ అంటూ తనకు తనే క్లీన్‌చిట్ ఇచ్చేసుకుంటూ ఆయన రాసిన రాతల్లోని మర్మం ఇదే. సంబంధం లేని విషయాన్ని ప్రస్తావించి... దానితో తనకే మాత్రం సంబంధం లేదని చెబుతూ ఆయన తప్పుదోవ పట్టిస్తున్నది ఎవరిని? ప్రజలనా? తన పాఠకులనా? లేక ఇప్పటికే విచారణ మొదలుపెట్టిన సీబీఐనా? ప్రజలన్నా... ప్రజాస్వామ్య వ్యవస్థలన్నా రామోజీకి ఎంతటి చిన్నచూపో... వాటిని ఏమార్చగలగటంలో తనపై తనకెంత నమ్మకమో బుధవారం నాటి ‘ఈనాడు’ పతాక కథనం ఒక్కటి చూస్తే తెలిసిపోతుంది. లిటిగేషన్లలో తనకెవ్వరూ సాటిరారని ఇన్నాళ్లూ విర్రవీగిన రామోజీ అక్రమాలపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం విచారణకు ఆదేశించటంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే తన పని మొదలుపెట్టింది. అక్రమాల తీగను లాగుతుండటంతో డొంక కదులుతుందేమోనని భయపడిన రామోజీ... పత్రికను అడ్డంపెట్టుకుని చేస్తున్న వాదనల్లో నిజానిజాలివిగో...
దివంగత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ తన ప్రజాహిత వ్యాజ్యంలో రామోజీపై చేసిన ఆరోపణేమిటంటే... శంషాబాద్ విమానాశ్రయం ఏర్పాటు, అనుమతులకు సంబంధించిన అధికారిక సమాచారం చంద్రబాబు చలవతో జనానికన్నా ముందుగా రాజ గురువుకే తెలిసిందని. దాన్ని ఉపయోగించుకున్న రామోజీ... అక్కడ వందల ఎకరాల భూముల్ని కొని భారీగా లబ్ధి పొందారని. అంతే తప్ప రామోజీకి అక్కడ భూములున్నాయి కనుక ఆయనకు లబ్ధి చేకూర్చడం కోసం అక్కడ విమానాశ్రయాన్ని ప్రకటించారని కాదు. ఈ తేడాను ‘గుర్తించని’ రామోజీ తప్పుడు వాదనలతో పేజీలకు పేజీలు నింపటమే విచిత్రం.
నిజమే! శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నది 1998 డిసెంబర్లోనే. అప్పటిదాకా అటు రామోజీ ఫిల్మ్ సిటీకి చేరువలోనా... ఇటు శంషాబాద్‌లోనా అంటూ ఊగిసలాడిన చంద్రబాబునాయుడి ప్రభుత్వం చివరకు శంషాబాద్‌వైపే మొగ్గు చూపింది. అంతమాత్రాన దానికి అన్ని అనుమతులూ వచ్చేసి... 1998లోనే పనులు మొదలైపోవటమన్నది జరగలేదు. ఈ స్థలాన్ని అనుకున్నాక కూడా ప్రభుత్వం వివిధ అనుమతుల కోసం ఎదురు చూడక తప్పలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు చాలా ఆలస్యంగా వచ్చాయి. విమాన యాన శాఖ నుంచి 29-5-2000న, పర్యావరణ శాఖ నుంచి 6-3-2003న అనుమతులొచ్చాయి. అంటే అప్పటిదాకా శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఖరారు కానట్లే లెక్క.
రామోజీరావు తన ఉద్యోగుల ద్వారా బినామీ కొనుగోళ్లను మొదలు పెట్టించింది కూడా కేంద్ర విమానయాన శాఖ నుంచి అధికారిక అనుమతి వచ్చిన తర్వాతేనన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. ఎందుకంటే ఎయిర్‌పోర్టుకు అదే కీలకం. అందుకే శంషాబాద్ విషయంలో కూడా ఆ అనుమతి వచ్చాకే... విమానాశ్రయం పరిధిలోకి వచ్చే గ్రామాలను గుర్తిస్తూ 2001 జులై 31న జీవో ఎంస్ నెంబరు 352ను విడుదల చేసింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (హాడా) పరిధిలోకి వచ్చే గ్రామాల్ని స్పష్టంగా గుర్తించింది.
ఖరారుకు ముందే రామోజీ కొనుగోళ్లు...
2000 మే 29న విమానయాన మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ వచ్చాక విమానాశ్రయం ఏర్పాటు తథ్యమని తేలిపోయింది. అప్పటిదాకా తెరవెనక చక్రం తిప్పిన రామోజీ... అది ఖరారు కావటంతో తన ఉద్యోగుల్ని రంగంలోకి దించారు. ఏయే గ్రామాలు విమానాశ్రయం పరిధిలోకి వస్తున్నాయనే జీవో 2001 జూలై 31న విడుదల కాగా... చంద్రబాబు మనసులో మాట లాంటి రామోజీకి దానికన్నా ముందే ఆ వివరాలన్నీ తెలిసిపోయాయి. ఫలితం... 2001 ఫిబ్రవరిలో రామోజీ బినామీలుగా ఆయన ఉద్యోగులు కొల్లి బాపినీడు చౌదరి, గోగినేని రాజేంద్రబాబు, వోరుగంటి గోవిందరావు, వి.వి.రాఘవేంద్రరావు, ఆర్.సుధాకర్ తదితరులు రంగంలోకి దిగారు. అప్పటికే ‘మై హోమ్ గ్రూప్’ అధిపతి జె.రామేశ్వరరావు తన డెరైక్టర్ల పేరిట, బంధుమిత్రుల పేరిట, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపెనీల పేరిట అప్పటికే అక్కడ భూములు కొనిపెట్టి సిద్ధంగా ఉంచారు. పనిలో పనిగా కొన్ని అసైన్డ్ భూముల్ని కూడా కొనేశారు. దాంతో వారి దగ్గర రామోజీ ఉద్యోగులు కోట్ల రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేశారు. 2001 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉద్యోగుల కొనుగోళ్లు పూర్తయిపోయాయి. నిజానికి తన ఉద్యోగుల్ని రంగంలోకి దింపి... ఒకే ప్రాంతంలో అంత పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయాలంటే దానికి ముందస్తు ప్రణాళిక, అమ్మకందార్లతో చర్చించడానికి కొంత సమయం ఇవన్నీ అవసరమవుతాయి. ఎంత లేదన్నా 420 ఎకరాల భూములు కొనుగోలు చేయడానికి... అదికూడా పలువురు ఉద్యోగుల చేత బినామీలుగా కొనిపించడానికి కనీసం ఐదారు నెలల సమయం అవసరం. అంటే కేంద్ర విమానయాన శాఖ నుంచి అనుమతి వచ్చిన తక్షణం రామోజీ రంగంలోకి దిగారన్న మాట.
ఏడాది తిరిగాక రామోజీ కొనుగోళ్లు...
అప్పటికే బినామీలుగా బరిలోకి దిగిన ఉద్యోగులు కోట్ల రూపాయలు పెట్టి భూములు కొనుగోలు చేయడంతో పాటు... భూ వినియోగ మార్పిడికి సంబంధించిన మార్పులన్నీ చేయించేయటంతో రామోజీ స్వయంగా రంగంలోకి దిగారు. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లే ఆ ఉద్యోగులు దరఖాస్తు చేసిన వెంటనే వ్యవసాయ అవసరాలకు వాడాల్సి ఉన్న భూమిని వాణిజ్య అవసరాలకు కూడా వినియోగించుకునేలా మార్పులు చేస్తూ అనుమతులిచ్చారన్నది ఇక్కడ ఎవ్వరికైనా తేలిగ్గా అర్థమయ్యే అంశం. రామోజీ గానీ, ఆయన తనయులు గానీ నేరుగా దరఖాస్తు చేస్తే తమ చేతికి మట్టి అంటుకుంటుందనే భయంతో ముందుగా ఉద్యోగుల చేత కొనుగోళ్లు చేయించి, వారి చేత భూ వినియోగ మార్పిడికి అనుమతి కోరుతూ దరఖాస్తులు చేయించారన్నదీ స్పష్టం. తన చేతికి మట్టి అంటకుండా మై హోమ్ గ్రూప్‌తో అసైన్డ్ భూముల్ని కొనుగోలు చేయించిందీ స్పష్టం. లైన్ క్లియర్ కావటంతో 2002 ఏప్రిల్లో రామోజీరావు, ఆయన తనయులు కిరణ్, సుమన్ నేరుగా రంగంలోకి దిగారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌నూ దించారు. తమ ఉద్యోగుల దగ్గర్నుంచి ఏడాది కిందట వారు ఏ ధరకు కొన్నారో అదే ధర చెల్లిస్తున్నట్లుగా చూపించి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పనిలో పనిగా మధ్యలోని ప్రభుత్వ భూమిని కూడా తమ ఖాతాలో వేసేసుకున్నారు. మొత్తానికీ కంచె వేసేసి, ‘ఎంసీఎఫ్ గార్డెన్స్’ అని బోర్డు పెట్టేశారు.
ఎన్నెన్ని ఉల్లంఘనలో..
ఇదీ... రామోజీ భూముల కథ. ఈ తప్పుడు వ్యవహారమంతా ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చేదాకా లోకానికి తెలియదు. ‘సాక్షి’లో వార్తలు వచ్చిన నేపథ్యంలో అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ప్రభుత్వ భూముల కబ్జాపై అధికారులు నోటీసులిచ్చారు. మొదట బుకాయించిన రామోజీ... చివరకు ప్రభుత్వ భూములు ఉన్న సంగతి తనకు తెలియదని, కావాలంటే వచ్చి చూసుకుని స్వాధీనం చేసుకోవచ్చని అమాయకత్వం నటించారు. అధికారులు కొంతవరకూ సర్వే చేసి... అక్రమాలు నిజమేనని తేల్చినా ఆ తరువాతి చర్యలు ఎందుకనో ఆగిపోయాయి!! తాజా సీబీఐ విచారణతో ఈ అక్రమాలన్నీ బయటపడతాయనే భయంతోనే... సీబీఐ తనకెప్పుడో క్లీన్‌చిట్ ఇచ్చేసినట్లు రామోజీ తప్పుడు కథనాలు రాస్తున్నారన్న అనుమానాలు ఎవ్వరికైనా రాకమానవు.
మై హోమ్ గ్రూప్ ఎందుకు విక్రయించింది?
కొద్దిరోజుల కిందట రామోజీరావు-పాల్మాకుల కుంభకోణంపై ‘సాక్షి’లో వార్తలు వెలువడ్డప్పుడు పిలవని పేరంటం మాదిరిగా మై హోమ్ గ్రూప్ అధిపతి రామేశ్వరరావు తెరపైకి వచ్చారు. రామోజీ తరఫున వకాల్తా పుచ్చుకుని... ‘‘ఆయన మా నుంచే భూములు కొన్నారు. మా సంస్థలే ఆయనకు భూములు విక్రయించాయి’’ అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి మై హోమ్ గ్రూప్ కాస్త పేరున్న రియల్టీ సంస్థ. తనకు వెంచర్లున్న ప్రతి చోటా అపార్ట్‌మెంట్లు లేదా కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించి విక్రయించిందే తప్ప కనీసం ఖాళీ స్థలాల్లో వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించిన దాఖలాలే లేవు!
అలాంటిది శంషాబాద్‌లో విమానాశ్రయం వస్తున్న నేపథ్యంలో అక్కడ ముందే... అంటే 1996, 1997 సంవత్సరాల్లోనే భూములు కొన్న ఈ సంస్థ, వాటిని రామోజీ బినామీలకు ఎందుకు విక్రయించేసిందన్నది ఇప్పటికీ ప్రశ్నే. విమానాశ్రయం ఏర్పాటు ఖరారయ్యాక... విమానయాన శాఖ క్లియరెన్స్ కూడా వచ్చాక ఎందుకో ఈ సంస్థ తన భూములన్నీ అమ్మేసింది. దాదాపు ఎకరం రూ.50 వేలు, రూ.లక్ష చొప్పున కొనుగోలు చేసిన ఈ సంస్థ... ఎకరా రూ.4 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో రామోజీకి విక్రయించేసింది. నిజానికి విమానాశ్రయం ఖరారుతో అప్పటికే అక్కడ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఆఖరికి రైతుల నుంచి సేకరించిన భూములకు కూడా ప్రభుత్వం ఎకరాకు రూ.4 లక్షలు చెల్లించింది! అదే ధరకు మై హోమ్ గ్రూపు రామోజీ ఉద్యోగులకు ఆ భూములు అమ్మేసిందంటే విచిత్రమే!
ఇంకా చిత్రమేంటంటే మైహోమ్ గ్రూపు సంస్థలు రామోజీ బృందానికి ఎకరా రూ.4-5 లక్షల మధ్య విక్రయించగా... మైహోమ్ డెరైక్టర్లు, రామేశ్వరరావు బంధువులు మాత్రం కారుచౌకగా అప్పగించేశారు. ఒక దశలో జి.వెంకటరావు అనే డెరైక్టరైతే 2001 ఫిబ్రవరిలో ఎకరా లక్ష రూపాయల చొప్పున కొని... ఆరు రోజులు గడిచేసరికి అదే ధరకు రామోజీ ఉద్యోగికి అమ్మేశారు. అసలు ఆరు రోజుల భాగ్యానికి ఆయన స్టాంపు డ్యూటీ కూడా చెల్లించి ఆ భూమి ఎందుకు కొన్నారో, రూపాయి కూడా లాభం లేకున్నా అదే ధరకు ఎందుకు విక్రయించేశారో రామోజీకే తెలియాలి. సీబీఐ విచారణలో ఇవన్నీ బయటికొస్తాయన్న భయం రామోజీకి పెరుగుతోందేమో!!!
-సాక్షి ప్రతినిధి, హైదరాబాద్
ఇదీ... సీబీఐ నివేదిక అసలు కథ
2006 సెప్టెంబరు 25: ‘‘పెద్దలా.. గద్దలా?’’ అంటూ వైఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ఈనాడు’లో పతాక స్థాయి వార్త ప్రచురితమైంది. దానికి నాలుగు పేజీల అనుబంధం కూడా తోడయింది.
2006 సెప్టెంబరు 25: నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ రోజు తిరుపతిలో ఉన్నారు. విలేకరులు ఆయన చుట్టూ చేరి ‘ఈనాడు’లో వచ్చిన వార్తను ప్రస్తావించారు. ‘‘దానిపై మేం సీబీఐ విచారణకు ఆదేశిస్తాం. నిజానిజాల్ని నిగ్గుతేల్చమని చెబుతాం’’ అన్నారాయన.
2006 సెప్టెంబరు 28: వైఎస్సార్ తన మాటకు కట్టుబడి సీబీఐ విచారణకు ఆదేశించారు. ‘‘ఔటర్ రింగురోడ్డు, కోకాపేట, మంఖాల్ టౌన్‌షిప్‌లతో పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం భూ సేకరణలో అక్రమాలేమైనా జరిగాయా? ఆ ప్రాజెక్టుల్ని చేపట్టడం ద్వారా ప్రభుత్వం ఎవరికైనా అయాచితంగా లబ్ధి చేకూర్చిందా?’’ అనే అంశాలపై విచారణ జరపాలని స్పష్టం చేశారు. ఫలితంగా ‘జీవో నంబరు 240’ విడుదలయింది.
2006 అక్టోబరు 20: సీబీఐ కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది. 2007 మే 31వ తేదీ వరకు విచారణ కొనసాగింది.
2007 జులై 3: విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, మంఖాల్ టౌన్‌షిప్, కోకాపేట వ్యవహారాలన్నిటిపై విచారణ జరిపిన సీబీఐ... ప్రతి అంశాన్నీ స్వతంత్రంగా విడిగానే పరిశీలించింది. తదనంతరం అన్నిటికీ వేరువేరు నివేదికలు అందజేసింది. ‘ఈనాడు’ రాతలు తప్పుల తడకలని తేల్చింది. భూ సేకరణలో అవకతవకలేవీ జరగలేదని, కాబట్టి కేసును మూసేయవచ్చంటూ సిఫారసు చేసింది.
ఇదండీ.. సంగతి. అంటే ‘ఈనాడు’ రాసిన తప్పుడు కథనాలపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించి సీబీఐ విచారణకు ఆదేశిస్తే... రామోజీరావు రాసినట్లుగా అక్కడ అవకతవకలేవీ జరగలేదని సీబీఐ నిర్ధారిస్తే... దాన్నిపుడు రామోజీ తనకు అనుకూలంగా వచ్చిన నివేదికగా ప్రచారం చేసుకుంటున్నారన్నమాట!!!. ఇంతకన్నా ఘోరం ఇంకేదైనా ఉంటుందా? ఇంతకన్నా దిగజారుడుతనం ఎక్కడైనా కనిపిస్తుందా? ఇంతకన్నా బరితెగింపు ఇంకెవరికైనా సాధ్యమవుతుందా?
సీబీఐ నివేదికలోని ఈ పేరా చూడండి...
‘‘విచారణలో భాగంగా 1997 నుంచి 1999 వరకు అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలోని శంషాబాద్, మక్తా బహదూర్ అలీ, గొల్లపల్లి కుర్ద్, గొల్లపల్లి కలాన్, మామిడిపల్లి, మంఖాల్, శ్రీనగర్ గ్రామాల్లో ఐదెకరాలు, అంతకన్నా పైబడి జరిగిన భూముల క్రయవిక్రయాలన్నిటినీ పరిశీలించాం. మంఖాల్‌లో 30, శ్రీనగర్‌లో 4, చిన్న గొల్లపల్లిలో 4, మక్తా బహదూర్ అలీలో 4, మామిడిపల్లిలో 8 లావాదేవీలు కనిపించాయి. శంషాబాద్‌లో ఒక లావాదేవీ బయటపడింది. మన్నెగూడ, రషీద్‌గూడ, ఖాజాగూడ గ్రామాల్లో ఇలాంటి లావాదేవీలేవీ జరగలేదు. పెపైచ్చు ఈ లావాదేవీలతో ఏ వీఐపీకీ సంబంధం లేదని తేలింది. దీనికి తోడు ఆయా గ్రామాల్లో ఐదెకరాల కన్నా ఎక్కువ భూమిని కలిగి ఉన్న 13 మందిని పిలిచి విచారించాం కూడా. వారికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని తేలింది’’
సీబీఐ తన నివేదికలో ఇంత స్పష్టంగా చెబుతున్నా రామోజీ ఎందుకు రంకెలేస్తున్నారు?
ఈ గ్రామాల్లో పాల్మాకుల పేరే లేదు కదా? అక్కడ భూములు కొన్న రామోజీ... తనకే సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చినట్టు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?
ఐదెకరాల కన్నా ఎక్కువ భూమిని కలిగి ఉన్న 13 మందిని పిలిచి విచారించినట్టు సీబీఐ చెబుతోంది. మరి తన పేరిట, తన కుమారుల పేరిట, కంపెనీ పేరిట ఏకంగా 421 ఎకరాలు కలిగి ఉన్న రామోజీని సీబీఐ పిలిచిందా? ఆయన సీబీఐ ఎదుట హాజరయ్యారా? లేనపుడు తనకు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చేసినట్లు పేజీలకు పేజీలు ఆ రాతలెందుకు?
సీబీఐ తాను కేవలం 1997 నుంచి 1999 మధ్య జరిగిన వ్యవహారాలనే పరిశీలించినట్లు చెబుతున్నా... ‘‘1999 నుంచి 2006 వరకూ జరిగిన అన్ని వ్యవహారాలపై సీబీఐ విచారణ జరిపింది’’ అంటూ రామోజీ అబద్ధాలెందుకు చెబుతున్నారు?
తాము విచారించిన గ్రామాల్లో వీఐపీలెవరికీ ఐదెకరాలకు మించి భూములు లేవని సీబీఐ చెబుతోంది. అంటే రామోజీ భూములు కొన్న గ్రామాన్ని విచారించలేదనే కదా అర్థం! లేకుంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఈ రాష్ట్రాన్ని అనధికారికంగా శాసిస్తున్న రామోజీ వీఐపీ కాదనా?
బాబు అంత భూమి ఎందుకిచ్చారు?
అసలు శంషాబాద్ విమానాశ్రయానికి అంత భూమి అవసరం లేదని, అయినా ఎందుకు కేటాయించారని వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ ప్రశ్నిస్తూనే వచ్చింది. దానికి తగ్గట్టు సీబీఐ తన విచారణలో కూడా ఆ విషయాన్ని స్పష్టంగా బయటపెట్టింది. ‘‘విమానాశ్రయానికి 3,000 ఎకరాలు సరిపోతాయని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టంగా చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకనో ఆ సిఫారసును పక్కనబెట్టింది. 5,492 ఎకరాల భూమిని కట్టబెట్టింది’’ అని సీబీఐ స్పష్టంగా పేర్కొంది. నిజానికి విమానాశ్రయం ఏర్పాటు చేసిన ప్రాంతంలో ప్రభుత్వానికి సొంతంగా 3,574 ఎకరాల భూమి ఉంది. దీనికి తోడు ఆయా గ్రామాల్లో పట్టాదారుల నుంచి 1,918 ఎకరాలను సేకరించింది. వారికి ఎకరాలకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లిస్తామనటంతో వారు ఎదురుతిరిగారు. చివరకు ప్రభుత్వం దిగి వచ్చి ఎకరాకు రూ.4 లక్షల వరకు చెల్లించాల్సి వచ్చింది. దీనిక్కూడా కొందరు నిరాకరించారు. ప్రభుత్వం గనక విమానాశ్రయం స్థలాన్ని ప్రభుత్వానికున్న 3,500 ఎకరాలకైనా పరిమితం చేసి... అవసరాల మేరకు భూమిని సేకరించాల్సి వస్తే వారికి ఆ పక్కనే ‘భూమికి భూమి’ కేటాయించి ఉంటే వారిక్కూడా న్యాయం జరిగేదన్న వాదన అప్పట్లో బలంగా వినిపించింది. కానీ బాబు ప్రభుత్వం ఎందుకనో దాన్ని పెడచెవిన పెట్టింది.
http://www.sakshi.com/Main/Fullstory.aspx?catid=276787&Categoryid=1&subcatid=33
No comments:
Post a Comment