బాబు హయాంలో రూ.25 కోట్ల పన్ను మినహాయింపులపై ఆరా
టీడీపీ అధినేత భారీ మొత్తంలో లబ్ధి పొందినట్లు ఆరోపణలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: మాజీ సీఎం చంద్రబాబు అక్రమాస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు ఊపందుకుంది. ఇందులో భాగంగా డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ లిమిటెడ్‌కు సీబీఐ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. బాబు హయాంలో భారీగా పన్ను మినహాయింపులకు సంబంధించి ఈ నోటీసులిచ్చారు. పన్ను మినహాయింపుల వివరాలను డాక్యుమెంట్లతో సహా అందించాలని పేర్కొన్నారు. సీబీఐ నోటీసులందాయని సంస్థ ప్రతినిధులు ధ్రువీకరించారు. వారు కోరిన పత్రాలలిస్తామని తెలిపారు. సీఎంగా చంద్రబాబు తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని 1998లో రెడ్డీస్ ల్యాబ్స్‌కు టాక్స్ డిఫర్‌మెంట్ వర్తింపజేయడం వల్ల సంస్థకు రూ.25 కోట్ల లబ్ధి చేకూరింది. ప్రతిగా వారి నుంచి ఆయన భారీగా లబ్ధి పొందారనే ఆరోపణలున్నాయి. బాబు కుటుంబీకుల భూములను మార్కెట్ విలువ కన్నా ఎక్కువకు రెడ్డీస్ అధిపతి అంజిరెడ్డి కుమారుడు సతీష్‌రెడ్డి, ఆయన భార్య దీప్తీరెడ్డి కొనుగోలు చేశారు. అదంతా బోగసని భూముల కొనుగోలు లావాదేవీలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. బాబు కుటుంబం ఆ భూములను ఎంతకు కొనుగోలు చేసింది, సతీష్‌రెడ్డికి ఎంతకు అమ్మింది, ఇందులో బాబుకు ముట్టిందెంత వంటి వివరాలపై సీబీఐ ఆరా తీస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలనూ అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
జరిగిందిదీ..: 1989లో బాబు కుటుంబం రామా అగ్రికల్చరల్ ఫామ్స్ పేరిట కొండాపూర్‌లో 3.27 ఎకరాలు కొనుగోలు చేసింది. బాబు భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్, తల్లి అమ్మణ్ణమ్మ రామాలో భాగస్వాములు. ఆ భూములనే సతీష్‌రెడ్డి, దీప్తిలకు 2000లో విక్రయించారు. వాటి మాటున కోట్ల ముడుపులు బాబుకు ముట్టాయన్న కోణమే ఇక్కడ కీలకంగా మారింది. మార్కెట్‌లో అప్పట్లో ఎకరా రూ.12 లక్షలున్న ఆ భూమిని ఎకరా రూ.కోటికి కొనుగోలు చేశారు. దానికి కూతవేటు దూరంలో అదే ఏడాది మదీనాగూడలో అమ్మణ్ణమ్మ ఎకరా రూ.8 లక్షల చొప్పున భూమిని కొన్నారు! ఈ క్రయ విక్రయాల తర్వాత కూడా కథ ఇంకా నడిచింది. ఆ 3.27 ఎకరాల డెవలప్‌మెంట్ కోసం దివ్యశ్రీ గ్రూప్‌తో సతీష్‌రెడ్డి కుటుంబం ఒప్పందం చేసుకుంది. అదే దివ్యశ్రీ గ్రూపునకు బాబు ప్రభుత్వం హైటెక్‌సిటీ లే ఔట్‌లో 7 ఎకరాలు కేటాయించారు.
సీబీఐ విచారణపై హైకోర్టుకు మురళీమోహన్
బాబు, ఆయన కుటుంబీకులు, బినామీల అక్రమాస్తులపై సీబీఐ విచారణకు ఆదేశాలను ఎత్తివేయాలంటూ జయభేరి అధినేత, టీడీపీ నేత మురళీమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మధ్యంతర ఉత్తర్వులపై బాబు బినామీలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులోనే తేల్చుకోవాలని కోర్టు స్పష్టం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను ఎత్తేయాలంటూ బాబు, ఆయన బినామీలు రామోజీ, నామా నాగేశ్వరరావు, సీఎం రమేశ్ ఇప్పటికే పిటిషన్లు వేయగా, తాజాగా మురళీమోహన్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్ష సాధింపునకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిటిషన్ చేశారని పేర్కొన్నారు. భూ కేటాయింపుల ద్వారా బాబు తనకు లబ్ధి చేకూర్చారనడం అవాస్తవమన్నారు.
http://www.sakshi.com/main/Fullstory.aspx?catid=276870&Categoryid=1&subcatid=33 |
No comments:
Post a Comment