
‘ఆంధ్రా  అన్నా హజారే’పై అవినీతి కేసా?! అంటూ ‘తెలుగు తమ్ముళు’్ల ఆగ్రహించినంత  మాత్రాన, అది ధర్మాగ్రహం అనిపించుకోదు. ‘ఎవరు తీసిన గోతిలో వారే పడతారు’  అన్న సామెతను బహుశా వారు మరచినట్టున్నారు. ‘తాము చేస్తే ఒప్పు, ఇతరులు  చేస్తే తప్పు’ అన్నది కాలం చెల్లిన భూస్వామ్య నీతి అనిపించుకుంటుందే కాని,  ప్రజాస్వామ్య రాజకీయ స్ఫూర్తి కానేరదు. అలాంటి వాదనలను ప్రజలు కూడా  మెచ్చరు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డిపై  అవినీతి ఆరోపణలతో దాఖలైన ‘ప్రజాప్రయోజనాల వ్యాజ్యం’లో హైకోర్టు ధర్మాసనం  సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పుడు, జగన్ అవినీతిపరుడా? కాదా? అన్న ప్రశ్న  తేలకముందే చంద్రబాబుతో సహా తెలుగు తమ్ముళ్లు వ్యవహరించిన తీరును ప్రజలింకా  మరచిపోలేదన్నది గుర్తించాలి. దొడ్డి దారిన అధికార పగ్గాలు చేపట్టిన  అమాత్యులతో, ప్రధాన ప్రతిపక్షంలోని సభ్యులు కొందరు కలిసో కలవకో,  యాదృచ్ఛికంగానే అయినా జగన్ అక్రమ ఆస్తులు కూడగట్టారని హైకోర్టుకు లేఖ రాసి  సీబీఐని రంగంలోకి దింపడానికి చేసిన ప్రయత్నం అక్రమం అనిపించకపోవడం  విడ్డూరమే. ‘జగన్ అక్రమాలపై అనేకసార్లు సీబీఐ విచారణకు ప్రభుత్వాన్ని  కోరినా, ప్రభుత్వం సిద్ధపడకపోవడంతో కోర్టునాశ్రయించక తప్పలేదు’ అన్న  తమ్ముళ్ల వాదన పస లేనిది. ఒకవేళ అదే నిజమనుకుంటే, చంద్రబాబు అవినీతిపై  వైఎస్ విజయమ్మ హైకోర్టుకు లేఖ రాయడాన్ని రాజకీయ కుట్రగా వర్ణించడం ఎలా  సాధ్యం? ఇదెక్కడి పద్ధతి! బాబు రాజకీయ మిత్రులు, సీపీఐ నేత నారాయణ కూడా  రాజకీయ దురుద్దేశంతోనే విజయమ్మ కోర్టుకు లేఖ రాశారని అంటున్నారు. జగన్‌పై  రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్, తెలుగుదేశం కూడబలుక్కుని కోర్టుకెక్కాయని  నారాయణ అనలేకపోయారు ఎందుకనో!

  ‘తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పాలన్నారు’ పెద్దలు. బాబుగారి తెలుగుదేశంతో  సీపీఐకి ఎన్నో రాజకీయ అవసరాలు ఉండి ఉండవచ్చు. శాసనసభలో కేవలం నాలుగు  స్థానాలున్న వారికి, రాష్ట్ర శాసన మండలిలో స్థానం దక్కించడంలో చంద్రబాబు  సహకారం అపూర్వం! అన్న కృతజ్ఞత వారికి ఉండటంలో ఆశ్చర్యం లేదు. అయినా, ఏమాట  కామాటే చెప్పుకోవాలి. కొందరు కాంగ్రెస్ నేతలకన్నా నారాయణే నయం. వైఎస్  సహకారం లేకుండా శాసనసభలో అడుగుపెట్టలేని వారు, ఆయన దయాదాక్షిణ్యాలతో  శాసనసభ్యులై, అమాత్యులుగా అందలమెక్కిన సంగతి తెలిసిందే! ‘అన్నం పెట్టిన  చేతినే కరచినట్టు’ వైఎస్ మరణానంతరం అలాంటి వారంతా కనీస కృతజ్ఞతాభావం  లేకుండా, నేడు అదే అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్‌ను అప్రతిష్టపాలు  చేసేందుకు ప్రయత్నించడం రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వారితో  పోలిస్తే నారాయణ వెయ్యి రెట్లు నయం కదా!
అదలా ఉంచితే, ప్రభుత్వ  నిష్క్రియాపరత్వాన్ని కోర్టులతో భర్తీ చేయగలరా? ‘మార్క్సిస్టులు’ అని  చెప్పుకునే వారిని ప్రశ్నిస్తే, జగన్ వంటి ‘అవినీతి సామ్రాట్టు’ను బలపరచడమా  అని వక్రీకరిస్తూ, ఎదురు ప్రశ్నించడం సమాధానం కాదు. సీబీఐ విచారణ ప్రాథమిక  దశలో ఉండగానే, కోర్టు తీర్పు వెలువడక ముందే జగన్‌పై రాజకీయనేతలే తీర్పులు  వెలువరించడం ఆక్షేపణీయం కాదా? అని ప్రశ్నించడం నేరం కాదు. 
ఆ  ప్రశ్నకూ జగన్‌కూ సంబంధం లేదు. అదొక సమకాలీన రాజకీయ సిద్ధాంతానికీ,  రాజ్యాంగ స్ఫూర్తికీ చెందిన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం దాటవేయడం రాజకీయ  ‘విజ్ఞత’ అనిపించుకోదు. వారు పూజించే రాజ్యాంగం సూత్రాలను గౌరవించాలని  గుర్తు చేస్తే, అది జగన్‌తో కుమ్మక్కయినట్లా! అలాంటప్పుడు, ప్రజా సమస్యలపై  వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీతో సైతం కలిసి పోరాడతామని  సీపీఎం నేత రాఘవులు ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ప్రజా  సమస్యలపై ఎవరితోనైనా కలిసి పోరాడటానికి అభ్యంతరకరం ఉండకూడదు. వీలైనంత  ఎక్కువ మంది ప్రజానీకాన్ని కదిలించేందుకు అదొక మార్గం. సీపీఐ, సీపీఎంలు  గతంలో అనేక పర్యాయాలు చంద్రబాబుతో కలిసి పోరాడాయి కూడా. కానీ, ఆ కలిసి  పోరాడటాన్ని ‘రాజకీయ ఐక్యత’ వరకూ లాగి, చివరకు 2009 శాసనసభ ఎన్నికల్లో ఏ  విధంగానూ సమర్థించలే ని చంద్రబాబు ‘మహాకూటమి’లో భాగస్వామిగా మారడం తీవ్ర  విమర్శకు గురైంది. కేవలం రాజశేఖరరెడ్డిని అధికారం నుంచి దించాలన్న ‘ఏకవాక్య  ఎజెండా’తో ఏర్పడిన ఆ మహాకూటమి పచ్చి అవకాశవాదంతో కూడిన పదవీ వ్యామోహ ధోరణి  తప్ప రాజకీయపరమైనది కానేకాదు. కాంగ్రెస్ పార్టీ లేదా టీడీపీ ఎన్ని చీలికలు  పేలికలైనా కమ్యూనిస్టులు బాధపడవలసిందేమీ లేదు. అలాంటి చీలికలు పేలికల  ఆసరాగా ఏర్పడే అవకాశవాద రాజకీయ పొత్తులు మాత్రం సమ్మతం కాదు.
‘అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు’ అన్న సామెతలా తయారైంది  నేడు చంద్రబాబు పరిస్థితి! చూపుడువేలు అందరికీ ఉన్నప్పటికీ, దాంతో రాజకీయం  నెరపడం తనకొక్కడికే సాధ్యమని మురిసిపోతుంటాడు బాబు. కాంగ్రెస్, అంతకు మించి  జగన్‌వైపు వేలెత్తి చూపే చంద్రబాబుకు ఇప్పుడు ఈ సామెత గతే పట్టింది!  తెలుగు తమ్ముళ్లయితే బరితెగించి మరీ జగన్‌కు తీహార్ జైలు తప్పదని జోస్యం  చెప్పారు. మరి ఇప్పుడు తమ అధినాయకునికి ఏ జైలు గది రిజర్వు చేస్తారో! ‘గాజు  మేడల్లో కూర్చున్న వారు, ఇతరులపై రాళ్లు రువ్వడం మంచిది కాదని, ఇప్పటికైనా  గ్రహిస్తే మంచిది.
ఇంతకీ, విజయమ్మ పిటిషన్‌పై బాబు ఏ కోర్టుకు  వెళతారో తేల్చి చెప్పలేదు. ‘గజం మిథ్య పలాయనం మిథ్య’ అన్నట్టు, చంద్రబాబు  అవినీతి మిథ్య, విజయమ్మ లేఖలో అంశాలు మిథ్య అయినప్పుడు విచారణకు వెరవడం  దేనికి? ఎదుటి వారు అవినీతిపరులని యాగీ చేసేముందు, తన విశ్వసనీయతనూ రుజువు  చేసుకోవాలి. చంద్రబాబు పదవీ వ్యామోహం, అవకాశవాద రాజకీయాలు తెలుగు ప్రజలకు  తెలియనివేమీ కావు. అందుకే, జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రకు ఎక్కడ చూసినా  ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే తెలివి తమ  సొత్తే అనుకుంటే పొరపాటే. తెలంగాణ సమస్యను అదే పనిగా నానుస్తూ పోతే,  క్రమేపీ తెలంగాణ ప్రజల్లో ఆ ఆకాంక్ష నీరుగారిపోతుందని అడ్డమైన ఎత్తులూ  వేస్తున్నది. వారి కలలు కల్లలు కాక తప్పదని తెలంగాణ సకల జనుల సమ్మె  నిర్ద్వంద్వంగా నిరూపించింది. ఎన్ని కుట్రలూ కుతంత్రాలూ పన్నినా, ప్రత్యేక  తెలంగాణపై ప్రజల ఆకాంక్ష చల్లారదన్నది పార్లమెంటు శీతాకాల సమావేశాలు  మరోసారి రుజువుచేస్తున్నాయి.
అయినా, 2014 వరకు ఏదో ఒక రీతిలో  కాలయాపన చేద్దామన్న కుయత్నాలకు కాంగ్రెస్ ఒడిగడుతోంది. ‘తాటినెక్కే  వాడొకడైతే, వాడి తలదన్నే వాడొకడన్నట్లు’ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి  యూపీ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చెయ్యాలన్న ప్రతిపాదనతో రంగం మీదకు  రావడమే కాక, ఆ మేరకు అసెంబ్లీలో ఏకంగా తీర్మానమే చేయించింది. దానితో  కాంగ్రెస్ కుదేలయింది. మాయావతి ఎత్తుగడతో రానున్న ఎన్నికలలో  ఉత్తరప్రదేశ్‌లో ఆధిపత్యం సంగతి సరేసరి, కాంగ్రెస్ మనుగడే ప్రశ్నార్థకంగా  మారింది. దానిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ కూడా రాష్ట్ర విభజనకు తామూ  సిద్ధమేనని ప్రకటించాలి! లేకుంటే అసలే జనాకర్షణలేక కుంటుతున్న రాహుల్ గాంధీ  పరిస్థితి, అక్కడ మరింత దెబ్బతింటుంది. అలా కాదని అంగీకరిస్తే తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటుకు ఎందుకు వెనకాడాలి? అన్న ప్రశ్న వస్తుంది. ‘ముందు గొయ్యి  వెనుక నుయ్యి’. ఇదీ కాంగ్రెస్ పరిస్థితి. రెండో ఎస్సార్సీ అంటే అది కాలయాపన  తప్ప మరొకటి కాదని ప్రజలు భావిస్తారు. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’  అన్నట్లు ఉత్తరప్రదేశ్‌లో బుందేల్ ఖండ్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా  గుర్తించాలన్నది కాంగ్రెస్ డిమాండే! ఇప్పుడు మాయావతి ఏకంగా ఒక్కటేమిటి  నాలుగు భాగాలుగా ఉత్తరప్రదేశ్‌ను విభజించాలంటూ ముందుకొచ్చారు!
ఇక  అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ  కుమ్మక్కయి విజయమ్మ చేత బాబుపై హైకోర్టులో పిటిషన్ వేయించారని తెలుగు  తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. కాని వాస్తవం మరోలా ఉంది. గుంటూరులో  అప్రతిహతంగా కొనసాగుతున్న ఓదార్పు యాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్  పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు సీబీఐ అంటే ‘కాంగ్రెస్ బ్యూరో  ఆఫ్ ఇన్వెస్టిగేషన్’గా కాంగ్రెస్ పార్టీ మార్చేస్తున్నదని కూడా  ప్రసంగిస్తున్నారు. మరోవైపు, విజయమ్మ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ప్రజా  కోర్టులో తేల్చుకుంటామని బాబు అంటున్నారు. ప్రజాకోర్టు అంటే మన రాష్ట్రంలో  ‘మావోయిస్టుల కోర్టు’లనుకునే ప్రమాదం ఉంది. ప్రజాకోర్టు అంటే ప్రజలలోకి  వెళ్లి తమ నేతపై కుట్రపూరితంగా విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పైన, అలాగే తమ  నేత అన్నా హజారేకి ప్రతిరూపమని గతంలో నిరూపితమైన విషయాన్ని ప్రజలలో ప్రచారం  చేస్తారట! ఈ విషయంలోనూ, జగన్ తరఫు నేతలు ప్రజాకోర్టు ఏమిటి, ప్రజాతీర్పుకే  వెళ్దాం అంటూ తెలుగుదేశం పార్టీని రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వంపై అవిశ్వాస  తీర్మానం పెట్టమని సవాలు చేస్తున్నారు. దాన్ని బలపరుస్తామని ఒకడుగు  ముందుకేసి ప్రకటిస్తున్నారు! వాస్తవం ఏమిటంటే, 2014లో గానీ ఎన్నికలు రావని,  అంతవరకూ ఈ ప్రభుత్వమే కొనసాగుతుందని ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు తెలుగు  తమ్ముళ్లూ ప్రకటించడం. ఈ విషయంలో తెలుగుదేశం నేతల సవాళ్లు ‘మాటలు కోటలు  దాటుతాయి. మనిషి గడపదాటడు’ అన్నట్లుంది. ఇదీ రాష్ట్రంలో నేటి రాజకీయ చిత్ర,  విచిత్ర నాటకం.
ఏమైనా హైకోర్టును ఒక విషయంలో అభినందించక తప్పదు.  నిష్పక్ష పాతంగా విచారణకు ఆదేశించింది. అదే విధంగా ఏ పక్షపాతమూ లేకుండా  తీర్పును వెలువరిస్తుందని ఆశిద్దాం! అయినా చట్టం తన పని తాను చేసుకుపోతూనే  ఉంటుంది. దానిని చేసుకోనిస్తే! ఇంతకీ చెప్పొచ్చేదేమంటే చంద్రబాబు నాయుడు,  జగన్ ఇద్దరూ సీబీఐ ఎంక్వయిరీని ఎదుర్కొంటున్నారు! తీర్పు వెలువడవలసే ఉంది.  మీడియా, రాజకీయ నేతలు సంయమనం పాటించి ముందస్తు తీర్పులు ఇవ్వకుండా ఉంటే అదే  పదివేలు! 
 http://www.sakshi.com/Main/Weeklydetails.aspx?Newsid=31668&subcatid=18&categoryid=1
No comments:
Post a Comment