Thursday 1 December 2011

అందరూ దొంగలే ! : చిక్కుల్లో సబిత!

చిక్కుల్లో సబిత!
సీబీఐ రిమాండ్ డైరీలో మంత్రి ప్రస్తావన
చార్జిషీటులోనూ పేరు చేర్చే అవకాశం

'అన్న' ఆదేశాలు యథాతథంగా అమలు?
గనుల మంత్రిగా గాలి ఫైళ్లకు రెక్కలు
ఒకే రోజు నోట్ ఫైల్, మంత్రి సంతకాలు
భవిష్యత్‌లోనైనా కష్టం తప్పదు
శ్రీలక్ష్మి అఫ్రూవర్‌గా మారితే పెద్దలకు సమస్యలే
నాటి ముఖ్యమంత్రి వైఎస్‌కు ఆమె 'చేవెళ్ల చెల్లెమ్మ'! ఆ 'అన్న' గీసిన గీత దాటకుండా అడిగిన ఫైళ్లన్నింటిపై ఆమె సంతకాలు చేసేశారా!? 'అన్నయ్య' మనసెరిగి గాలి గనుల ఫైలుకు రెక్కలు తొడిగారా? గాలి గనుల లీజుల ఫైలు కదిలిన తీరు, సీబీఐ విచారణలో బయటపడుతున్న విషయాలను గమనిస్తే... ఈ అనుమానాలు కలుగక మానవు.

2007 జూన్ 18
ఓఎంసీకి మైనింగ్ లీజులు కేటాయిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి151, 152 జీవోలు జారీ చేశారు.

2007 జూన్ 19
మైనింగ్‌పై అనంతపురం జిల్లా గనులశాఖ సహాయ సంచాలకుడితో ఓఎంసీకి లీజు ఒప్పందం కుదిరింది.

2007 జూన్ 20
ఓఎంసీకి పర్మిట్లు జారీ! ... ఫటాఫట్. ధనాధన్! మూడే మూడు రోజుల్లో మొత్తం పని ఫినిష్!

"జీవో నెంబర్ 151, 152లకు సంబంధించిన నోట్‌షీట్‌ను 2007 జూన్ 18వ తేదీన తెరిచారు. అదే రోజున గనుల శాఖ మంత్రి (సబితా ఇంద్రా రెడ్డి) వీటిని ఆమోదించారు. అదే రోజున జీవోలు జారీ అయ్యాయి.''
- రిమాండ్ కేస్ డైరీలో సీబీఐ


హైదరాబాద్, నవంబర్ 29 : నాటి గనుల శాఖ మంత్రి, నేటి హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని చిక్కులు చుట్టుముడుతున్నాయి. గాలి కేసు నిందితులు సీబీఐకి చెబుతున్న అంశాలు, కోర్టుకు సీబీఐ సమర్పించిన రిమాండ్ డైరీలో సబిత ప్రస్తావన ఉండడంతో అందరి దృష్టీ మంత్రి వైపునకు మళ్లింది. గాలి గనుల కేసులో అక్రమాలన్నీ ఆమెకు తెలిసే జరిగాయనే అనుమానం బలపడుతోంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే సబితకు గనుల శాఖ కట్టబెట్టారు.

మిగతా మంత్రులందరి మాట ఎలా ఉన్నప్పటికీ... సబితను మాత్రం 'చేవెళ్ల చెల్లెమ్మ'గా చేరదీశారు. ఆమె గనుల శాఖ మంత్రిగా ఉండగానే అనేక లీజుల వ్యవహారాలు జరిగిపోయాయి. ఇప్పుడు గనుల డొంక కదిలించేందుకు సీబీఐ లాగుతున్న తీగలు సబిత మెడకు చుట్టుకుంటున్నాయి. డిసెంబర్ 2న దాఖలు కానున్న చార్జిషీటులోనూ ఆమె పేరు ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తే... ఇప్పటికిప్పుడు కాకపోయినా సమీప భవ్యిషత్‌లోనైనా సబితకు తిప్పలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

ఇదే సంకేతమా?
గాలి జనార్దన్ రెడ్డికి గనులు కేటాయించే నోట్‌ఫైల్ 2007 జూన్ 18న తయారైంది. శ్రీలక్ష్మి అదే రోజు దానిని ఆమోదించి... గనుల మంత్రిగా ఉన్న సబితకు పంపించారు. అదే రోజున సబిత కూడా దీనికి ఆమోద ముద్ర వేయడం, రెండు జీవోలు జారీ కావడం చకచకా జరిగిపోయింది. ఈ విషయాన్ని సీబీఐ అధికారులు రిమాండ్ డైరీలో ప్రస్తావించారు. ఇక్కడ సబిత పేరు నేరుగా ప్రస్తావించనప్పటికీ... 'గనుల మంత్రి' అని హోదాను మాత్రం పేర్కొన్నారు. పైకిచూడడానికి శ్రీలక్ష్మిని తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యల్లాగా కనిపిస్తున్నప్పటికీ... 'దీని వెనుక సబిత పాత్ర కూడా ఉంది' అని సీబీఐ అన్యాపదేశంగా ప్రస్తావించినట్టయింది.

నోట్‌ఫైల్‌పై సంతకం చేసిన కార్యదర్శికి ఎంత బాధ్యత ఉంటుందో, దానిని ఆమోదిస్తూ సంతకం చేసే మంత్రికీ అంతే బాధ్యత ఉంటుంది. నిబంధనలు అతిక్రమించి నోట్ ఫైల్ తారుమారు చేసి, 'క్యాప్టివ్' పదం ఎగరగొట్టి జీవోలు జారీ చేశారన్న అభియోగంపైనే శ్రీలక్ష్మి అరెస్ట్ అయ్యారు. అదే తప్పును సబిత కూడా «ద్రువీకరించినట్లయింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ అధికారులు సబిత నివాసానికి వెళ్లి ఆమె వివరణ తీసుకున్నారు. "కార్యదర్శి పంపిన నోట్‌ఫైల్‌ను నేను ఆమోదించాను. అంతకుమించి నాకేమీ తెలియదు'' అని ఆమె చెప్పినట్లు సమాచారం. అయితే... బిజినెస్ రూల్స్ ప్రకారం 'నాకేమీ తెలియదు' అన్నంత మాత్రాన తప్పు ఒప్పై పోదు. ఈ వాదన న్యాయస్థానం ముందు నిలవదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

పెద్దల పాత్రపైనే గురి...
గనుల లీజులకు సంబంధించి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చాయి? నిబంధనలు ఉల్లంఘించి లీజులు ఇవ్వడానికి కారణమేమిటి? జీవోల్లో క్యాప్టివ్ అనే పదం ఎలా మాయమైంది? శశి కుమార్ దరఖాస్తు లీజుకు అర్హమైనప్పటికీ, దానిని ఎందుకు ప్రాసెస్ చేయలేదు? వంటి ప్రశ్నలకు శ్రీలక్ష్మి నుంచి సమాధానాలు రాబట్టాలని సీబీఐ భావిస్తోంది. తనపై ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారని ఇప్పటికే అరెస్టు అయిన గనులశాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ సీబీఐకి వివరించారు.

మరోవైపు... ఈ కేసులో శ్రీలక్ష్మి, రాజగోపాల్, సబితలు పాత్రధారులేనని, సూత్రధారి కేవీపీ రామచంద్రరావేనని గాలి 'బాధితుడు' తపాలా శ్యాం పేర్కొనడం మరో సంచలనానికి తెర లేపింది. గనుల రేసు నుంచి తప్పుకోవాల్సిందిగా వైఎస్ జగన్ బెదిరించినట్లు మరో బాధితుడు కొండారెడ్డి అంతకుముందే చెప్పారు. ఇదంతా చూస్తే... గాలి గనుల వెనుక ఎన్నో 'బిగ్‌షాట్స్' ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఒకవేళ శ్రీలక్ష్మి అప్రూవర్‌గా మారితే ఈ పెద్దలందరికీ చిక్కులు తప్పవు! 


 https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/30/main/30main1&more=2011/nov/30/main/main&date=11/30/2011

No comments:

Post a Comment