Thursday, 1 December 2011

అందరూ దొంగలే ! : జగన్ మీడియా విలువ 284 కోట్లే!

జగన్ మీడియా విలువ 284 కోట్లే!
మోసపూరితంగా పెంచి చూపించి రూ.1200 కోట్లు తెచ్చారు

లంచాల రూపంలో పెట్టుబడులు తీసుకున్నారు
డెలాయిట్‌ను మరోసారి విచారించాలి
డాక్యుమెంట్లు విడుదల చేసిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 11: మీడియా కంపెనీలను నెలకొల్పినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ వాటి అసలు విలువను అడ్డగోలుగా వందల కోట్ల నుంచి వేల కోట్ల రూపాయలకు పెంచేశారని టీడీపీ ఆరోపించింది. "జగన్‌కు సంబంధించిన వారి ఒత్తిడి వల్ల తాము ఆయన మీడియా కంపెనీల విలువను రూ.1000 కోట్లు పెంచి రూ.3500 కోట్లుగా చూపించామని డెలాయిట్ కంపెనీ ప్రతినిధి సుదర్శన్ సీబీఐ ముందు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. సుదర్శన్ చెప్పింది కూడా అబద్ధమే.

జగన్ మీడియా కంపెనీల విలువ రూ.284 కోట్లేనని చెన్నైకి చెందిన చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థ జగదీశన్ అండ్ కో లెక్కగట్టింది. ఆ సంస్థల విలువ ఇంత తక్కువ ఉన్నప్పుడు డెలాయిట్ వేల కోట్ల రూపాయల విలువని ఎలా లెక్క కడుతుంది? డెలాయిట్ ప్రతినిధులను సీబీఐ అధికారులు మరోసారి పిలిపించి విచారించాలి'' అని ఆ పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన ఆరోపణలకు మద్దతుగా జగదీశన్ అండ్ కో సమర్పించిన నివేదికలోని భాగాలను ఆయన పత్రికలకు విడుదల చేశారు.

తన కంపెనీల విలువను ఇష్టానుసారం పెంచి చూపించి వాటిలోకి రూ.1246 కోట్లను జగన్ పెట్టుబడులుగా తెచ్చుకొన్నారని ఆరోపించారు. ఇంత తక్కువ విలువ ఉన్న సంస్థల్లోకి ఇన్ని వందల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదని అన్నారు. "సాక్షి పత్రిక, టీవీ మార్కెట్లోకి రాకముందే వాటికి విపరీతంగా లాభాలు వస్తాయని కనుక్కొని కొందరు పారిశ్రామికవేత్తలు రూ.10 షేరును రూ.350కి కొనుగోలు చేశారు. డెలాయిట్ నివేదికను చూసే తాము అంతంత పెట్టుబడులు పెట్టామని వాళ్లు ఇప్పుడు బుకాయిస్తున్నారు.

ఏదో కంపెనీ నివేదికను చూసి గబగబా పెట్టుబడులు పెట్టేంత తెలివి తక్కువ వ్యక్తులు కాదు వాళ్లు. ప్రభుత్వం వద్ద పనులు చేయించుకొనే లంచాలను ఇలా పెట్టుబడుల రూపంలో పెట్టారు. రాష్ట్ర సంపదను దోచుకొని దాచుకొన్న వ్యక్తులు, ముఠాలే ఈ పని చేశాయి. జగన్‌తోపాటు వారిని కూడా విచారించాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.

టీడీపీ తన పాలన కాలంలో రాష్ట్ర పారిశ్రామిక వేత్తలకు ఒక గౌరవం తెస్తే.. వైఎస్ హయాంలో వారు తమ గౌరవాన్ని పోగొట్టుకొని ప్రపంచవ్యాప్తంగా అందరూ హీనంగా చూసే స్థితిని తెచ్చుకొన్నారని విమర్శించారు. సాక్షి పత్రికను పెట్టిన తర్వాత కూడా జగన్ తన తప్పుడు పద్ధతులను మానలేదని ఆరోపించారు. "సత్యం సంస్థకు సర్టిఫికెట్లు ఇచ్చిన ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ నుంచే జగన్ తన పత్రికకు ఒక సర్టిఫికెట్ పుట్టించారు.

దానికి 13 లక్షల సర్క్యులేషన్ ఉందని సర్టిఫికెట్ తీసుకొని ఆ ప్రకారమే ప్రభుత్వ ప్రకటనల రేట్లు ఖరారు చేయించుకొన్నారు. ఆ సర్టిఫికెట్‌ను కొంతకాలం ఆ పత్రిక వెబ్‌సైట్‌లో పెట్టారు. ఇప్పుడు తీసేశారు'' అని వివరించారు. తప్పు చేసిన వారి గురించి తామైనా... సీబీఐ అయినా ఒకే రకంగా మాట్లాడతామని, దానికి విపరీత అర్థాలు తీసి ఉపయోగం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన అన్నారు. 

 https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/12/main/12main6&more=2011/nov/12/main/main&date=11/12/2011

No comments:

Post a Comment