Thursday, 1 December 2011

అందరూ దొంగలే ! : బడా చోర్..... కంపెనీలు ఎక్కడో.. చెక్కులిచ్చింది ఒక్కడే!

బడా చోర్
కంపెనీలు ఎక్కడో.. చెక్కులిచ్చింది ఒక్కడే!
ఎమ్మార్-ఎంజీఎఫ్ స్కామ్‌లో కొత్త కోణం

మాయ కంపెనీలతో బోగస్ 'విల్లా'సం
ఒకే రోజు 10 కంపెనీలకు 18 ప్లాట్లు
'ఆంధ్రజ్యోతి' పరిశోధనలో బట్టబయలు
ఎక్కడెక్కడో, ఏవేవో చిరునామాలతో పుట్టగొడుగుల్లా తట్టెడు కాగితపు కంపెనీలు వెలిసి ఒక వ్యక్తి చేతిలోకి పెట్టుబడులు ప్రవహించిన వైనాన్ని మనం ఈ రాష్ట్రంలో చూశాం. అధికారంలో చేసిన మేళ్లకు ప్రతిఫలంగా కోటానుకోట్లు కొల్లగొట్టిన తీరును గమనించాం. సరిగ్గా... ఇదే తరహా తంతు ఎమ్మార్‌లోనూ చోటు చేసుకుందా? అత్యంత విలువైన ఈ వెంచర్‌లో ప్లాట్లను కొట్టేసే ఏకైక లక్ష్యంతో పలు కాగితపు కంపెనీలను సృష్టించారా?

అక్కడ ఒక్కడి కంపెనీలోకి పెట్టుబడుల రూపంలో కోట్లు ప్రవహించినట్లే... ఇక్కడ ఒక్కడి ఖాతాలోకి అనేక ప్లాట్లు దఖలు పడ్డాయా? ఈ క్రమంలో ఉత్తరాదిన ఉన్న ఢిల్లీలో, దక్షిణం కొసన ఉన్న కేరళలో ఇళ్లకు కరువొచ్చినట్లు... ఒకే చిరునామాతో నామ్‌కే వాస్తే కంపెనీలు వెలిశాయా? అవి చిత్తు కాగితాల్లా చెక్కులను పరస్పరం పంచుకున్నాయా? ఔను! ఇదంతా అక్షరాలా జరిగింది. ఆ సత్యం 'ఆంధ్రజ్యోతి' పరిశీలనలో బట్టబయలైంది. 'ఎమ్మార్-ఎంజీఫ్' అక్రమాల డొంకలో కళ్లు చెదిరే, దిమ్మ తిరిగే సరికొత్త మలుపు! మీరే చదవండి!



హైదరాబాద్, నవంబర్ 28 : ఎమ్మార్ అక్రమాల్లో ఇదో కొత్త కోణం. కంపెనీల పేరిట జరిగిన మాయా 'విల్లా'సం! వ్యాపారం కోసం పెట్టే కంపెనీలు వేరు! అవసరాల కోసం సృష్టించే కంపెనీలు వేరు! ఎమ్మార్ 'విల్లాసం'లో కేవలం ప్లాట్లు సొంతం చేసుకునేందుకే ఇలా కొన్ని కంపెనీలు పుట్టాయి. బహుశా... వీటన్నింటినీ ఒక్కరే పుట్టించారు! ఎమ్మార్ - ఏపీఐఐసీలకు పరిమితమైన ఈహెచ్‌టీపీఎల్‌లోకి 'ఎంజీఎఫ్' జొరబడినప్పటి నుంచే ఈ ప్లాట్లతో కంపెనీల కోలాటం మొదలైంది.

ఈహెచ్‌టీపీఎల్‌లో తన వాటాను ఎంజీఎఫ్‌కు విక్రయించేందుకు 2005 మే నెలలో తొలి అడుగు పడింది. తొలుత ఈ దరఖాస్తును ఏపీఐఐసీ తిరస్కరించింది. ఆ తర్వాత 2006 నవంబర్ 3న 'అడ్డదారి'లో ఈ అక్రమ ఒప్పందం కుదిరిపోయింది. అంతకంటే ముందే... ఎంజీఎఫ్ పేరిట 'ప్లాట్ల' కేటాయింపు మొదలైంది. 2006 జూన్ 16వ తేదీ ఒకే రోజున ఢిల్లీకి చెందిన ఏడు కంపెనీల పేరిట 13, ఎర్నాకుళంలో రిజిస్టరయిన మూడు కంపెనీల పేరిట 5 ప్లాట్లు 'అలాట్' అయ్యాయి. అంతేకాదు... ప్లాట్లు కేటాయించిన దాదాపు నాలుగేళ్లకు అంటే గత ఏడాది మార్చి 22న ఒకే రోజున ఈ కంపెనీలన్నీ ప్లాటు విలువలో పది శాతం మొత్తాన్ని చెక్కుల రూపంలో చెల్లించాయి.

వీటన్నింటినీ చదరపు గజం రూ.5 వేలకే ఇచ్చారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'అయితే ఏంటి? ఒకే రోజు అలాట్‌మెంట్ జరగొద్దా? ఒకే రోజు చెక్కులు ఇవ్వొద్దా?' అని కొందరైనా ప్రశ్నించవచ్చు. అసలు కిటుకు మొత్తం ఈ కంపెనీల పుట్టుకలోనే ఉంది. ఈ కంపెనీలన్నిటికీ ఎంజీఎఫ్‌లో వివిధ స్థాయిలకు చెందిన ఉద్యోగులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో చిత్రమేమిటంటే... తమ పేరిట కంపెనీలు ఉన్నట్లు, ఆ కంపెనీలకు ఎక్కడో హైదరాబాద్‌లో ఉన్న ఈహెచ్‌టీపీఎల్‌లో (బౌల్డర్ హిల్స్) ప్లాట్లు ఉన్నట్లు వీరికి తెలియనే తెలియదు! ఒక బడా నేత ఆడించిన జగన్నాటకంలో ఇది ఒక అధ్యాయం మాత్రమే! ఇలాంటివి చాలానే ఉన్నాయి!

ఏ కంపెనీ.. ఎన్ని ప్లాట్లు
ఢిల్లీ కంపెనీలు

1. ఎకో ఆగ్రో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ - 2 ప్లాట్లు
2. నవగ్రహ రియల్‌కన్ ప్రైవేట్ లిమిటెడ్ - 2
3. కింగ్‌స్టార్ రియల్‌కన్ ప్రైవేట్ లిమిటెడ్ - 2
4. క్రేవ్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ - 2
5. ఫ్రాలిక్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్‌లిమిటెడ్ - 2
6. యూనికార్న్ ఇన్‌ఫ్రాకామ్ ప్రైవేట్ లిమిటెడ్ - 2
7. బ్లిస్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ - 1

కేరళ కంపెనీలు..
1. షాలిన్ మార్కెటింగ్ సర్వీసెస్ (కేరళ) - 2
2. స్టాకామ్ప్ కన్సల్టెన్సీ కార్ఫహాన్సెస్ సర్వీస్ - 2
3. ప్రోమా ప్రొఫెసనల్ సొల్యూషన్స్ - 1

ఒకే చిరునామాలో ఉన్నవి...
ఢిల్లీ...
* క్రేవ్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, డబ్ల్యూజెడ్214, 215, నవీన
* ఫ్రాలిక్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, డబ్ల్యూజెడ్214, 215, నవీన

కేరళ
* ప్రోమా ప్రొఫెషనల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, 41/214,
జేఎన్ హౌస్, మహాకవి భారతీయార్ రోడ్, ఎర్నాకుళం
* షాలిన్ మార్కెటింగ్ సర్వీసెస్(కేరళ) ప్రైవేట్ లిమిటెడ్, 41/ 214, జేఎన్‌హౌస్, మహాకవి భారతీయార్‌రోడ్, ఎర్నాకుళం
* స్టాకామ్ప్ కన్సల్టెన్సీ కార్ఫహాన్సెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, 41/214, జేఎన్‌హౌస్, మహాకవి భారతీయార్‌రోడ్, ఎర్నాకుళం.


కంపెనీలు వేరే.. చిరునామాలు అవే
బౌల్డర్ హిల్స్‌లో విల్లా లేదా ప్లాటు ఉండటం ఒక స్టేటస్ సింబల్. సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ఇక్కడ ప్లాటు పొందడం కోసం పోటీలు పడ్డారు. 'మాకొకటి ఇప్పించండి ప్లీజ్' అంటూ భారీస్థాయిలో పైరవీలు చేయించారు. అలాంటిది... ఢిల్లీ, ఎర్నాకుళం కంపెనీలకు 18 ప్లాట్లు, అందులో 15 పక్కపక్కనే, ఒకే రోజు కేటాయించడమే ఇక్కడ విశేషం. మరో విశేషమేమిటంటే... ఇక్కడ చెరో రెండు ప్లాట్లు పొందిన క్రేవ్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్రాలిక్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఢిల్లీలో ఒకే చిరునామాలో ఉన్నాయి.

అలాగే... మొత్తం ఐదు ప్లాట్లు పొందిన షాలిన్ మార్కెటింగ్ సర్వీసెస్, ప్రోమా ప్రొఫెషనల్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాకామ్ప్ కన్సల్టెన్సీ కార్ఫహాన్సెస్ సర్వీస్ సంస్థలు ఎర్నాకుళంలో ఒకే చిరునామాలో ఉన్నాయి. ఇంత జరిగాక... నిజంగానే ఆ చిరునామాల్లో కంపెనీలు ఉన్నాయా? అని సందేహం రాక మానదు! ఈ సందేహం తీర్చుకునేందుకు 'ఆన్‌లైన్' ప్రయత్నించింది. ఢిల్లీలో మచ్చుకు మూడు చిరునామాలకు వెళ్లి, ఆ ఫ్లాట్ల యజమానులను ప్రశ్నించింది. చాలా రోజులుగా ఆ చిరునామాల్లో నివసిస్తున్నామని వారు తేల్చి చెప్పారు. వెరసి... అవి బోగస్ చిరునామాలతో ఏర్పడిన బోగస్ కంపెనీలని ఇట్టే తేలిపోయింది. ఇది చిరునామాల చిత్రం!

ఒకరే 'చెక్'కిన వంచనా శిల్పం
ఇక చెక్కుల విషయంలో ఇంతకు మించిన చిత్రం జరిగింది. ఢిల్లీకి చెందిన యూనికార్న్ ఇన్‌ఫ్రాకామ్ సంస్థ తనకు కేటాయించిన రెండు ప్లాట్ల కోసం కోటక్ మహీంద్రా బ్యాంక్ (అంబా దీప్ బ్రాంచ్, ఢిల్లీ)కు చెందిన 000001, 000003 చెక్కులు (రూ.6.00 లక్షలు, 5.30 లక్షలు) ఇచ్చింది. మరి... మధ్యలో ఉన్న చెక్కు ఎక్కడికి పోయిందో తెలుసా? అది ఎర్నాకుళంలోని బ్లిస్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు దక్కింది. ఈ సంస్థ తాను పొందిన ప్లాటుకు 000002 చెక్కు ద్వారా రూ.4,27,000 చెల్లించింది. ఎంత చిత్రమో కదూ!

అంటే.. ఈ రెండు సంస్థల తరఫున ఒకే వ్యక్తి చెక్కులు జారీ చేశారు. చెక్కుల మాయ ఇంతటితో ఆగలేదు. వేర్వేరు కంపెనీలు వంద, రెండొందల నెంబర్ల తేడాతో చెక్కులు జారీ చేశాయి. ఉదాహరణకు... ఢిల్లీకి చెందిన నవగ్రహ రియల్‌కాన్ సంస్థ ఢిల్లీలోని షాలిమార్గ్ బాగ్ బ్రాంచ్ ఎస్‌బీఐకి చెందిన 188743, 744 నెంబర్ల చెక్కులను జారీ చేయగా... ఎకో ఆగ్రోటెక్ సంస్థ 188843, 844 చెక్కులు ఇచ్చింది. అలాగే... ఫ్రాలిక్ కన్‌స్ట్రక్షన్ సంస్థ 754706, 707 చెక్కులను జారీ చేయగా... క్రేవ్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 754904, 906 చెక్కులను ఇచ్చింది.

వేర్వేరు కంపెనీలు ఒకే ప్రాజెక్టులో ప్లాట్లు కొనడం ఒక వింత అయితే... ఇంత దగ్గర దగ్గర నెంబర్లున్న చెక్కులు ఇవ్వడం మరో వింత! ఇదంతా చూస్తే... ఇది ఎంతమాత్రం యాధృచ్ఛికం కాదని, ఒకే ముఠా పథకం ప్రకారం నడిపించిందని ఇట్టే అర్థమవుతుంది. ఈహెచ్‌టీపీఎల్ ప్రాజెక్టులో ఎంజీఎఫ్ భాగస్వామ్యం పొందడమే అక్రమం. ఈ ప్రతిపాదనను ఏపీఐఐసీ తోసిపుచ్చినప్పటికీ... కార్పొరేషన్ పాలకమండలి ఆమోదంగానీ, ప్రభుత్వ సమ్మతిగానీ లేకుండానే ఈ చీకటి వ్యవహారం నడిపించారు.

ఇందుకు... ఈహెచ్‌టీపీఎల్‌లో ఏపీఐఐసీ తరఫు డైరెక్టర్లుగా ఉన్న ఐఏఎస్ బీపీ ఆచార్య, పార్థసారథి రావు సహకరించారు. వీటన్నింటి వెనుకా ఒకే ఒక ముఠా పని చేసింది. ఈ ముఠాలో ఎవరి వాటాలు వారికి అందాయి. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన 'బడా చోరుడి'కి ఇలా 'ప్లాట్ల పందేరం' జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఎమ్మార్ అక్రమాల డొంక కదిలిస్తున్న సీబీఐ మరింత బలంగా తీగ లాగితే ఆ 'బడా చోర్' ఎవరో బయటపడుతుంది!

అన్ని సందేహాలే
+ మన రాష్ట్రానికి చెందిన సినీ, రాజకీయ, వాణిజ్య ప్రముఖులు ఒక్క ప్లాటు దొరికితే చాలు అనుకునే బౌల్డర్‌హిల్స్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన అనామక కంపెనీలకు 18 ప్లాట్లు ఎలా దక్కినట్లు?
+ కంపెనీలన్నాక ఒక పద్ధతి ప్రకారం పని చేస్తాయి. కానీ... ఒకరి చెక్కు బుక్కులను మరొకరు పంచుకోవడం ఎలా సాధ్యం? ఒకవేళ... ఈ రెండు కంపెనీలకు ఇంకెవరైనా చెక్కులు 'వితరణ' చేశారనుకుంటే కచ్చితంగా ఏదైనా ప్రయోజనం ఆశించే చేసి ఉండాలి. ఎవరా 'బడా చోర్'? ఏమిటా ప్రయోజనం?
+ ఈ కంపెనీలకు బి-60 నుంచి బి-74 వరకు... వరుసగా 15 ప్లాట్లు కేటాయించారు. వీటి మొత్తం విస్తీర్ణం 15,962 చదరపు గజాలు. అంటే... ఆ 'బడా చోరుడి' చేతిలో ఒకేచోట 3.32 ఎకరాల స్థలం! అందులో ఏ స్థాయి భవంతి కట్టుకుంటాడో మరి!
+ ఒకే లేఔట్‌లో రెండు ప్లాట్లు కొనాలనుకుంటే పక్క పక్కవి కొనేందుకు ప్రయత్నిస్తారు. కానీ, ఇక్కడ రెండేసి ప్లాట్లు కొన్న కంపెనీలు ఎనిమిది ఉండగా... వీటిలో ఒక్కటీ పక్క పక్కన లేవు. ఇవి పైకి వేర్వేరుగా కనిపించినా... వీటి వెనుక ఉన్నది ఒక్కరేగా! సరిహద్దులు చెరిపేస్తే స్థలమంతా ఒక్కటే! అలాంటప్పుడు ప్లాట్లు పక్కపక్కన లేకుంటేనేం!

"సి7 52ఎ' అనే ఈ ప్లాట్‌లో నేను 73 నుంచి ఉంటున్నాను. ఇది నాది, నేరుగా నాకే ఎలాట్ అయ్యింది. మా అబ్బారు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తాడు. ఇది పూర్తిగా నా సొంత ఆస్తి'' - ఇదీ ఈ ప్లాట్ అసలు యజమాని 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి'తో చెప్పిన వాస్తవం. కానీ, ఇదే చిరునామాలో నవగ్రహ రియల్‌కాన్ అనే సంస్థ ఉన్నట్లు చూపించారు.

38వ నెంబరు ఫ్లాట్‌లో నేను ఉంటాను. దీన్ని మేం సంజయ్ దగ్గర నుంచి కొన్నాం. మా అపార్ట్‌మెంట్‌లో ఎలాంటి కంపెనీలు లేవు. (39వ నెంబర్ ఫ్లాట్‌లో బ్లిస్ ఇన్‌ఫ్రా టెక్ ఉన్నట్టు చూపారు)

ప్లాట్ నెంబర్ 44 సెక్టార్ 9లోని ఫ్లాట్ నెం 48లో ప్రభాకర్ అనే ఆయన ఉంటారు. ఇక్కడ ఎంజీఎఫ్ అనే పేరుతో ఎలాంటి కంపెనీ లేదు. ప్రభాకర్ మాత్రమే ఉంటారు.

 https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/29/main/29main1&more=2011/nov/29/main/main&date=11/29/2011

No comments:

Post a Comment