Thursday, 1 December 2011

అందరూ దొంగలే ! : ఎమ్మార్.. బేజార్ సర్కారుతో కాళ్ల బేరానికి వచ్చిన సంస్థ

ఎమ్మార్.. బేజార్
సర్కారుతో కాళ్ల బేరానికి వచ్చిన సంస్థ
ఎంజీఎఫ్‌తో తెగదెంపులు చేసుకుంటాం
2002 ఒప్పందం ప్రకారం నడుచుకుంటాం
ప్రభుత్వానికి లేఖ రాసిన ఎమ్మార్ చైర్మన్ అలబార్

సీబీఐ విచారణ దెబ్బకు దుబాయ్ 'షేకు' గజగజ
ప్రాజెక్టు కొనసాగిస్తామంటూ రాయబారం
26 శాతం వాటాపై ఇంతకు ముందూ ఉత్తరాలు
విల్లాలు అమ్మేసుకొని ఒప్పందం అమలంటే ఎలా?
హైకోర్టు విచారణ, సీబీఐ దర్యాప్తు సంగతేంటి?
పరిశ్రమల శాఖ అధికారుల విస్మయం
పాపాలన్నీ చేసేసి.. గంగలో మునిగితే ప్రాయశ్చిత్తం అయిపోతుందా? చేయాల్సిందంతా చేసేసి.. పొరపాటైంది క్షమించండి అని ప్రాధేయపడితే తప్పులన్నీ ఒప్పులై పోతాయా? చట్ట ఉల్లంఘనలకు పాల్పడి.. లెంపలేసుకొంటే.. శిక్ష నుంచి తప్పించుకోవచ్చా? ఎమ్మార్ ప్రాపర్టీస్ యాజమాన్యం మాత్రం అవుననే భావిస్తోంది మరి.

అదెలాగంటే.. ఎమ్మార్ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ దెబ్బకు ఆ సంస్థ యాజమాన్యం దిమ్మతిరిగింది. సర్కారుతో కాళ్లబేరానికి వచ్చింది. ఏపీఐఐసీతో 2002లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ప్రాజెక్టును కొనసాగిస్తామని ఎమ్మార్ ప్రాపర్టీస్ చైర్మన్ మొహమ్మద్ అలబార్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు లేఖ రాశారు.



హైదరాబాద్, నవంబర్ 27 : ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు దిమ్మతిరిగింది. రాష్ట్రంలోని ఎమ్మార్ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ... సర్కారు చర్యలతో దుబాయ్ షేకులు 'షేక్' అయ్యారు. సర్కారుతో కాళ్ళ బేరానికి వచ్చారు. ఎమ్మార్‌హిల్స్ టౌన్‌షిప్ ప్రాజెక్టు లిమిటెడ్ (ఈహెచ్‌టీపీఎల్)కు ఢిల్లీకి చెందిన ఎంజీఎఫ్‌తో కుదిరిన అభివృద్ధి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామంటూ షేకులు బేషరతుగా ప్రకటించారు. అంతేగాకుండా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)తో 2002 నవంబర్ 6న ఎమ్మార్ ప్రాపర్టీస్ పీజేఎస్‌సీ దుబాయ్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ప్రకారమే ప్రాజెక్టును అమలు చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు.

ఈ మేరకు ఎమ్మార్ ప్రాపర్టీస్ చైర్మన్ మొహమ్మద్ అలబార్.. మన రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఒక లేఖ రాశారు. ఈ లేఖ ప్రతి పరిశ్రమల శాఖకు కూడా చేరిందని విశ్వసనీయ వర్గాలు «ద్రువీకరించాయి. తాజా పరిణామాల నేపథ్యంలో.. పాత ఒప్పందం ప్రకారమే ప్రాజెక్టును అమలు చేస్తామని సర్కారుకు ఎమ్మార్ ప్రాపర్టీస్ లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది. "అయితే.. ఎమ్మార్ ప్రాపర్టీస్ వివాదంపై హైకోర్టులో కేసు నడుస్తోంది. సీబీఐ విచారణ జోరుగా సాగుతోంది. ఈ దశలో ఎమ్మార్ లేఖపై ప్రభుత్వం స్పందించే అవకాశంలేదు'' అని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి.

పిల్లిమొగ్గలు ఇదే మొదటిసారి కాదు
ఈ ప్రాజెక్టు విషయంలో ఎమ్మార్ పిల్లిమొగ్గలు వేయటం ఇదే మొదటిసారి కాదు. ఈ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత ఈహెచ్‌టీపీఎల్ ప్రాజెక్టులో ఏపీఐఐసీకి ఉన్న 26 శాతం వాటాకుగాను అభివృద్ధి చేసిన భూమిలో 26 శాతం వెనక్కి ఇస్తామని ఎమ్మార్ రాయబారాలు నడిపిన సంగతి తెలిసిందే. దీనిపై ఒకవైపు చర్చలు సాగుతుండగానే ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసును సీబీఐ చేపట్టిన ఫలితంగా ఈ ప్రతిపాదన బుట్టదాఖలైం ది. దాంతో కలవరపాటుకు గురైన ఎమ్మార్ ప్రాపర్టీస్ యాజమాన్యం ఇప్పుడు మరో మెట్టు దిగింది.

ఎంజీఎఫ్‌తో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని.. ఏపీఐఐసీతో 2002లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ప్రాజెక్టును అమలు చేస్తామని ఇప్పుడు చెబుతోంది. మొత్తానికి పాత పాపాలను కప్పిపుచ్చుకునేందుకే ఎమ్మార్ ప్రాపర్టీస్.. ఇలా ప్రభుత్వంతో కాళ్ల బేరానికి వస్తోందని పరిశ్రమల శాఖ వర్గాలు అంటున్నాయి. "ఎంజీఎఫ్‌తో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ఎమ్మార్ ప్రాపర్టీస్ ఇప్పుడు ప్రకటిస్తే... ఇప్పటి వరకూ చేసిన పాపాలన్నీ కనుమరుగైపోతాయా? శిక్ష పడకుండా పోతుందా?'' అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

వైఎస్ హయాంలోనే అసలు గోల్‌మాల్
నిజానికి.. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో గోల్ఫ్‌కోర్సు, కన్వెన్షన్ సెంటర్‌లతో కూడిన సమగ్ర ప్రాజెక్టు అమలుకు చంద్రబాబు అధికారంలో ఉండగా ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థకు 535 ఎకరాలు కేటాయించారు. ఈ మేరకు 2002 జనవరి 6న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2005లో ఈ ప్రాజెక్టును సమీక్షించారు. దాంతో.. 2005 ఏప్రిల్ 19న అనుబంధ ఒప్పందం జరిగింది.

తర్వాతే అసలు గోల్‌మాల్ మొదలైంది. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మార్ ప్రాపర్టీస్‌లోకి ఎంజీఎఫ్ రంగ ప్రవేశం చేసింది. ఏపీఐఐసీ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఈహెచ్‌టీపీఎల్ వ్యవహరించినా అప్పటి ఏపీఐఐసీ ఎండీ, ఈహెచ్‌టీపీఎల్ బోర్డు సభ్యుడిగా ఉన్న బి.పి.ఆచార్య ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఇదంతా ప్రభుత్వ పెద్దల అండతో సాగిన దందా కావటంతో ఆనాడు అందరూ మౌనంగా ఉండిపోయారు.

అక్రమాలే లేకపోతే.. తప్పులు దిద్దుకుంటామని లేఖ ఎందుకో?
కాగా.. తాను ఎండీగా ఉన్న సమయంలో ఈహెచ్‌టీపీఎల్‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదని... ఇప్పటికీ ఈ ప్రాజెక్టులో ఏపీఐఐసీకి 26 శాతం వాటా ఉందని ఆచార్య వాదిస్తున్నారు. పోనీ ఆచార్య చెప్పినట్లు ఎలాంటి అవకతవకలు జరగకపోయి ఉంటే.. ఎమ్మార్ ప్రాపర్టీస్ పీజేఎస్‌సీ దుబాయ్ చైర్మన్ అలబార్ ఎంజీఎఫ్‌తో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని సర్కారుకు తాజాగా ఎందుకు లేఖ రాశారని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

అలబార్ లేఖతో ఏపీఐఐసీ-ఎమ్మార్ ప్రాపర్టీస్ మధ్య ఒప్పంద ఉల్లంఘన జరిగిందనే విషయం స్పష్టమవుతోందని చెబుతున్నారు. ఒక వైపు ప్రభుత్వ సంస్థ ప్రయోజనాలు కాపాడాల్సిన కొంతమంది అధికారులు ఇంకా ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో ఎలాంటి అక్రమా లు జరగలేదని వాదిస్తుంటే.. ఒప్పందం చేసుకున్న భాగస్వామ్య సంస్థ మాత్రం తమ తప్పులను దిద్దుకుంటామని సర్కారుకు లేఖ రాయటం విశేషం.

ఎమ్మార్-ఎంజీఎఫ్‌గా మారిందిలా!
ఎమ్మార్ ప్రాపర్టీస్-ఎంజీఎఫ్‌ల మధ్య 2006 నవంబర్ 3న అభివృద్ధి ఒప్పందం జరిగింది. దీంతో ఎమ్మార్‌హిల్స్ టౌన్ షిప్ ప్రాజెక్టు లిమిటెడ్ (ఈహెచ్‌టీపీఎల్)కు చెందిన 258 ఎకరాల.. వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమి కొత్తగా అవతరించిన ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ పరమైంది. తర్వాత 2007 జూలై 25న అభివృద్ధి ఒప్పందంతో పాటు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తూ మరో ఒప్పందం చేసుకున్నారు. ఏపీఐఐసీతో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ ఎమ్మార్ ప్రాపర్టీస్ పీజేఎస్ సీ, దుబాయ్ సంస్థ ఈహెచ్‌టీపీఎల్‌కు చెందిన 258 ఎకరాలను ఎమ్మార్ ఎంజీఎఫ్‌కు బదిలీ చేయటంతోపాటు మార్కెటింగ్, బ్రాండింగ్ బాధ్యతలు అప్పగించింది.

ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో ఏపీఐఐసీకి కుదిరిన అనుబంధ ఒప్పందంలోని క్లాజు 8 ప్రకారం ఈహెచ్‌టీపీఎల్ హౌసింగ్ ప్రాజెక్టును అంతర్గతంగా సమకూర్చుకున్న వనరుల ద్వారా చేపట్టాలని నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ఈహెచ్‌టీపీఎల్ ప్రాజెక్టులోకి ఎంజీఎఫ్ ఎప్పుడైతే భాగస్వామిగా చేరిందో అప్పుడే ఈ ప్రాజెక్టుకు 258 ఎకరాల భూమి సమకూర్చిన ఏపీఐఐసీ వాటాకు పూర్తిగా గండిపడింది. ఎమ్మార్ ఎంజీఎఫ్ ఈ ప్రాజెక్టు పేరుతో వందల కోట్ల రూపాయలు సంపాదించినా... ఏపీఐఐసీకి మాత్రం ఒక్క రూపాయి కూడా దక్కలేదు. 

 https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/28/main/28main1&more=2011/nov/28/main/main&date=11/28/2011

No comments:

Post a Comment