2002లో 6 వేల టన్నులే.. 2003లో 4.76 లక్షల టన్నుల తవ్వకాలు
రూ. 56 లక్షల రాయల్టీ కూడా వసూలు చేసిన బాబు ప్రభుత్వం
ఇప్పుడేమో ఏమీ తెలియనట్లు బుకాయింపు..
జనం కళ్లకు గంతలు కట్టే యత్నం
చంద్రబాబు విధానాన్నే కొనసాగించిన వైఎస్
వాస్తవాలను వెల్లడిస్తున్న మైనింగ్ శాఖ రికార్డులు
బాబు పాత్రపైనా దర్యాప్తు జరగాలంటున్న నిపుణులు
అనంతపురం, న్యూస్‌లైన్: వందలు కాదు, వేలు కాదు.. ఓబుళాపురం గనుల్లో అక్షరాలా లక్షల టన్నుల తవ్వకం, తరలింపు ఆరంభమైంది సాక్షాత్తూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలోనే! ఇప్పుడేమో తనకేమీ తెలియదనీ, ఎడాపెడా ఖనిజం తవ్వకాలకు, తరలింపుకూ దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విధానాలే కారణమని చంద్రబాబు ఎంతగా బుకాయిస్తున్నా.. మైనింగ్ శాఖలో నమోదైన రికార్డులు అసలు నిజాల్ని వెల్లడిస్తున్నాయి. ఓఎంసీ తవ్వకాల్లో ఒకవేళ అక్రమాలు జరిగి ఉంటే.. వాటికి బీజం వేసిన తొలి ముద్దాయి చంద్రబాబేననీ, అసలు గాలి జనార్దన్‌రెడ్డి కేసులోనూ చంద్రబాబు పాత్రపై కూడా సీబీఐ దర్యాప్తు జరగాలని రికార్డులను పరిశీలించిన నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం ఓబుళాపురం వద్ద 25.981 హెక్టార్ల విస్తీర్ణంలో ఇనుప ఖనిజం లభించే భూమిని జి.రామ్మోహన్‌రెడ్డికి లీజుకు ఇస్తూ 1996లో చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే లీజును గాలి జనార్దన్‌రెడ్డి డెరైక్టర్‌గా ఉన్న ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఓఎంసీ)కు బదలాయిస్తూ 2002 ఫిబ్రవరి 18న అదే చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నంబర్: 80) ఇచ్చింది. ఆ ఖనిజం తరలింపుకు కూడా పర్మిట్లు ఇచ్చేసింది. చంద్రబాబు ఔదార్యం కారణంగానే 2002-03లో కేవలం ఆరు వేల టన్నుల తవ్వకం, తరలింపు జరగ్గా.. అది ఒకే సంవత్సరంలో (2003-04లో) 4,75,827 టన్నుల తవ్వకం, తరలింపు స్థాయికి పెరిగిపోయింది. దీనికి గాను చంద్రబాబు ప్రభుత్వం ఓఎంసీ నుంచి ఏకంగా రూ. 56,32,220 రాయల్టీ కూడా వసూలు చేసింది. అనంతపురం మైనింగ్ శాఖలో నమోదైన అధికారిక రికార్డులే ఈ వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం ఇప్పటికీ ఇనుప ఖనిజం తవ్వకం వ్యవహారాల్లో తనకు ఏమీ ప్రమేయం లేదని.. అదంతా వైఎస్ హయాంలో మాత్రమే గాడితప్పిందని బుకాయిస్తున్నారు. అధికారిక రికార్డులు మాత్రం చంద్రబాబు హయాంలోనే ఓఎంసీ తమ రెగ్యులర్ వ్యాపార ప్రణాళిక ప్రకారమే అన్ని అనుమతులూ పొంది తవ్వకాలు ఆరంభించిందని, ఆ చంద్రబాబు విధానాన్ని వైఎస్ కొనసాగించారని స్పష్టం చేస్తున్నాయి.
డిమాండ్ పెరిగిందిలా..: చైనాలో 2008లో ఒలింపిక్స్ క్రీడలు జరిగిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా ప్రభుత్వం 2001 నుంచే ఏర్పాట్లను ప్రారంభించింది. ఇందుకోసం భారీ ఎత్తున స్టేడియాలను నిర్మించింది. ఇదే సమయంలో అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం ఇనుప ఖనిజం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఇనుప ఖనిజానికి డిమాండ్ అధికంగా ఉండేది. ధర కూడా గరిష్టంగా పలికింది. ఇలాంటి సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఓబుళాపురం ఇనుప గనుల లీజును ఓఎంసీకి బదలాయించింది. ఓఎంసీ తనకు వచ్చే ఆర్డర్లను బట్టి ఇనుప ఖనిజాన్ని వెలికితీసి, ఎగుమతి చేసింది. తన వ్యాపార ప్రణాళికలో భాగంగానే 2002-03లో ఆరు వేల టన్నులు, 2003-04లో 4,75,827 టన్నులను చైనాకు ఎగుమతి చేసింది. అనంతపురంలోని గనుల శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తే ఈ వాస్తవాలు స్పష్టమవుతాయి. ఆ రికార్డులను ‘న్యూస్‌లైన్’ పరిశీలిస్తే ఈ వాస్తవ గణాంకాలన్నీ బయటపడ్డాయి. ఒకవేళ ఓఎంసీ ఖనిజ తవ్వకాల్లో అక్రమాలంటూ జరిగితే దానికి బీజం వేసింది చంద్రబాబే కాబట్టి.. గాలి జనార్దన్‌రెడ్డి కేసులో సీబీఐ దర్యాప్తు చంద్రబాబుపైనా జరగాల్సిన అవసరాన్ని ఈ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
No comments:
Post a Comment